2019–20 ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రెండోదఫా పూర్తి బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. రెండో ఆర్థిక ఏడాదిలో కూడా నవరత్నాల హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తామని సీఎం జగన్ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన నేప థ్యంలో బడ్జెట్ దీన్ని ప్రతిబింబించనుంది. అన్నదాతలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపించనుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇటు రాష్ట్రం, అటు కేంద్రం నుంచి ప్రభుత్వానికి రాబడులు పూర్తిగా తగ్గిపోయాయి. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా గత సర్కారు పెద్దఎత్తున పెండింగ్‌లో పెట్టిన బిల్లులను చెల్లిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జనరంజకంగా బడ్జెట్‌ను తీర్చిదిద్దటంపై ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన సుదీర్ఘ కసరత్తు చేశారు.
నవరత్నాల అమలుకు తేదీలతో క్యాలెండర్..
► ఆర్ధిక పరిస్థితి దిగజారినప్పటికీ నవరత్నాలకు బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. నవరత్నాల పథకాల అమలుకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు తేదీలతో సహా క్యాలెండర్‌ను ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆ పథకాలన్నింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు.
► కొన్ని రంగాలకు బడ్జెట్ బయట నుంచి వ్యయం చేయనున్నారు. దీంతో కొన్ని కేటాయింపులు బడ్జెట్‌లో కనిపించవు. నాబార్డు, ఇతర ఆర్ధిక సంస్థల నిధులతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. దీంతో ఆయా రంగాలపై వ్యయం బడ్జెట్ కేటాయింపుల కన్నా ఎక్కువగానే ఉండనుంది. కానీ ఆ నిధులను బడ్జెట్ కేటాయింపుల్లో చూపలేకపోతున్నారు.
► ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెబుతోంది. మరోపక్క వృధా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెర దించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.
పలు పథకాలు, ప్రాజెక్టులకు నిధులు..
► పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం ‘వైఎస్‌ఆర్ ఆసరా’ పథకానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేస్తున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కల కోసం ‘వైఎస్‌ఆర్ చేయూత’ పథకానికి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు చేస్తున్నారు. అమ్మఒడి, వైఎస్‌ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవపాయం, సాగునీటి రంగం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధానం కల్పించారు.
► ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన అవుకు టన్నెల్–2, వెలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార 2వ దశ, వంశధార–నాగావళి అనుసంధానం ప్రాజెక్టులకు తగిన నిధులను బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.
► రాయలసీమ దాహార్తి తీర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. కడప స్టీల్ ప్లాంటుతోపాటు పోర్టుల నిర్మాణాలకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు.
కరోనాతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం
గత సర్కారు మిగిల్చిన బకాయిలు, అప్పులు తీర్చడంతో పాటు కరోనాతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. మార్చి నుంచి రెవెన్యూ రాబడులు పూర్తిగా తగ్గిపోయాయి. మద్య నియంత్రణతో ఆదాయం గణనీయంగా తగ్గింది. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చడం కత్తిమీద సాముగా మారినప్పటికీ ప్రభుత్వం సమతుల్యత పాటిస్తూ సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ కేటాంపుల్లో ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.
బడ్జెట్ బయట నిధుల నుంచి వ్యయం...
► ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కింద రూ.21 వేల కోట్లకు పైగా వ్యయం చేయనున్నారు. అయితే మరో రూ.10 వేల కోట్లకుపైగా బడ్జెట్ బయట నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత విద్యుత్ సబ్సిడీ, వైఎస్‌ఆర్ జనతా బజార్లతోపాటు నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రులు, సూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీవ్యయం చేయనున్నారు. ఆర్ధిక పరిమితుల దృష్ట్యా ఈ వ్యయం బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో కనిపించకపోయినప్పటికీ బడ్జెట్ బయట నిధులు వ్యయం చేయనున్నారు.
► కేంద్ర, రాష్ట్ర రాబడులు తగ్గిన నేపథ్యంలో 2020–21 పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూ.2.25 లక్షల కోట్లతో రూపొందించినట్లు సమాచారం.
మార్చిలో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్
కరోనా నేపథ్యంలో 2020–21 ఆర్ధిక సంవత్సరానికి మార్చి నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనందున తొలి త్రైమాసికానికి (ఏప్రిల్ – జూన్ వరకు) సంబంధించిన వ్యయానికి ద్రవ్య వినిమయ–ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌ను మంత్రివర్గం ఆమోదంతో మార్చిలో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. తొలి త్రైమాసికంలో అన్ని రంగాలకు అవసరమైన రూ.70,994.98 కోట్ల వ్యయానికి ఆర్డినెన్స్ వీలు కల్పించింది.
నేడు, రేపు బడ్జెట్ సమావేశాలు!
కరోనాతో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మంగళ, బుధవారాల్లో రెండు రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. దీనిపై నేడు ఉదయం జరగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జూలై నుంచి వ్యయం చేయాలంటే తప్పనిసరిగా ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ సభ అమోదం పొందాల్సి ఉంది. తప్పనిసరిగా బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉన్నందున సమావేశాలు జరగనున్నాయి.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం..
ఈ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజభవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ వెంటనే శాసన సభ, మండలి వ్యవహారాల కమిటీలు (బీఏసీ) సమావేశమై సభల అజెండాను, సమావేశాలు నిర్వహించే రోజులను ఖరారు చేయనున్నాయి. ఉభయ సభలు తిరిగి ప్రారంభమై గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం తెలుపుతాయి. ఆ తరువాత మధ్యాహ్నాం 12–30 నుంచి 1 గంట మధ్యలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీలో 2020–21 ఆర్ధిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పిస్తారు. దీంతోపాటు 2019–20 ఆర్ధిక సర్వేను కూడా సభకు సమర్పిస్తారు. ఇదే సమయానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసన మండలిలో బడ్జెట్‌ను చదువుతారు. వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెడతారు. ఇదే సమయానికి శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చదువుతారు. అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడనున్నాయి.
పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుకు రేపు ఆమోదం..
– బుధవారం ఉదయం ఉభయ సభల్లో శాఖల పద్దులను ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరుగుతుంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లులను ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన తరువాత సభ అమోదం పొందుతుంది. శాసనమండలి కూడా అదే రోజు పద్దులకు, ద్రవ్య వినిమయ బిల్లులకు ఆమోదం తెలుపుతుంది. పలు కీలక బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.
నవరత్నాలకు పెద్ద పీట: బుగ్గన
కరోనా నేపధ్యంలో ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలోని నవరత్నాలకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆయన సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఆర్ధికంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిందేనని, దీనిపై మరో ఆలోచన చేయరాదనే లక్ష్యంతోనే బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అభివృద్ధి, సంక్షేమం సమతూకంతో బడ్జెట్ ఉంటుందన్నారు.
బడ్జెట్ నేపథ్యంలో ప్రధానికి సీఎం జగన్ లేఖ
రాజ్యాంగపరమైన ప్రక్రియ మేరకు బడ్జెట్‌ను తప్పనిసరిగా ఆమోదించుకోవాల్సి ఉండటం, బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ముందుగానే నిర్ణయించిన నేపథ్యంలో ప్రధాని మోదీతో ఈనెల 16, 17వ తేదీల్లో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కాకపోవచ్చని సమాచారం. ఈమేరకు ప్రధానికి ముందుగానే సమాచారం ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment