ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
తొలిరోజు శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
రూ.4 కోట్ల విలువైన వజ్రాభరణాలను సమర్పించిన భక్తులు
నేడు శ్రీ గాయత్రిదేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా మహోత్సవాల తొలి రోజున అమ్మవారు శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున దుర్గమ్మకు స్నపనాభిõÙకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం ఉదయం 8.40 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలిగా రాష్ట్ర మంత్రులు ఆనం, పార్థసారథి అమ్మవారి తొలి దర్శనం చేసుకున్నారు.
మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద గణపతి పూజ నిర్వహించారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక కుంకుమార్చన, ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద శ్రీచక్ర నవార్చన, యాగశాలలో చండీహోమాలు నిర్వహించగా ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ కనుల పండువగా సాగింది.
మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, ఘాట్‌రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌గౌర్‌తో పాటు ఏపీకి చెందిన రాజే‹Ù, సూర్యకుమారి రూ.4 కోట్ల విలువైన వజ్రాభరణాలను అమ్మవారికి సమర్పించారు. ఇందులో వజ్రాలు పొదిగిన 2 కిలోల బంగారంతో తయారు చేసిన వజ్ర కిరీటం, సూర్యచంద్ర ఆభరణాలు, ముక్కెర, నత్తు, బులాకీ ఉన్నాయి. ఈ ఆభరణాలతో శుక్రవారం అమ్మవారు శ్రీగాయత్రిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
వైభవంగా మైసూరు దసరా ఉత్సవాలు
దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ ప్రఖ్యాత మైసూరులో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవత చాముండేశ్వరి దేవి కొలువైన చాముండి కొండపై ఉదయం శుభ వృశ్చిక లగ్నంలో దీపాన్ని వెలిగించి, అమ్మవారి ఉత్సవమూర్తికి పుష్పార్చన గావించి అగ్ర పూజ చేయడం ద్వారా దసరా సంబరాలకు నాంది పలికారు. ఈ ఏడాది ప్రముఖ సాహితీవేత్త డా.హంపా నాగరాజయ్య ఉత్సవాలను ప్రారంభించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉదయం కొండకు విచ్చేసిన హంపా, సీఎం తదితరులకు కళాబృందాల ప్రదర్శనల మధ్య పూర్ణకుంభ స్వాగతం లభించింది. జానపద కళా బృందాలతో ఊరేగింపుగా చాముండేశ్వరి ఆలయానికి చేరుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల ఉన్న దసరా వేదికకు చేరుకుని వెండి రథంలో ప్రతిష్టించిన చాముండేశ్వరి దేవికి పూజలు చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు.
మైసూరు రాజప్రసాదంలో రాజవంశీకుడు, స్థానిక బీజేపీ ఎంపీ యదువీర్ చామరాజ ఒడియార్ దర్బార్ నిర్వహించారు. బంగారు, వజ్రకచిత సింహాసనంపై ఆశీనులైన అలనాటి రాజుల కాలంలో మాదిరిగా దర్బార్ చేశారు. రాజమాత ప్రమోదాదేవి, యదువీర్ భార్య, తనయుడు పాల్గొన్నారు. బెంగళూరులో 10 కి పైగా వేదికల్లో సాంస్కృతిక నృత్య ప్రదర్శనల కోలాహలం మిన్నంటింది.
– మైసూరు
Comments
Please login to add a commentAdd a comment