సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డు చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన రోజుని చెరిపేసే అవకాశం వచ్చింది. ఎన్నో సబ్‌మెరైన్లకు మరమ్మతులు పూర్తి చేసినా సింధుకీర్తి విషయంలో మూటకట్టుకున్న అపప్రద ఇంకా షిప్‌యార్డుని వెంటాడుతూనే ఉంది. హెచ్‌ఎస్‌ఎల్‌కు సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన సింధుకీర్తి మరమ్మతుల్ని నిర్ణీత సమయంలో పూర్తి చేసి.. గతంలో పోయిన ప్రతిష్టని తిరిగి సంపాదించుకునేందుకు షిప్‌యార్డు నడుంబిగించింది.
1990 జనవరి 4న భారత నౌకాదళంలోకి ప్రవేశించిన ఐఎన్‌ఎస్ సింధుకీర్తి సబ్‌మెరైన్.. జూన్ 2006లో మరమ్మతులకు గురైంది. రీఫిట్ పనుల బాధ్యతను హిందూస్థాన్ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్)కు ఇండియన్ నేవీ అప్పగించింది. అయితే కారణాలేవైనా సింధుకీర్తి మరమ్మతుల విషయంలో హెచ్‌ఎస్‌ఎల్ చాలా ఆలస్యం చేసింది. మూడేళ్ల సమయం కోరిన షిప్‌యార్డు ఏకంగా తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘంగా మరమ్మతులు చేసింది. షిప్‌యార్డు చేసిన ఆలస్యానికి సింధుకీర్తి సబ్‌మెరైన్‌కు డాక్‌యార్డు క్వీన్ అనే పేరుని కూడా మూటకట్టుకుంది. చివరికి 2015లో రూ.912 కోట్ల ఖర్చుతో సింధుకీర్తి మరమ్మతులు పూర్తి చేసి నౌకాదళానికి అప్పగించారు. దీంతో షిప్‌యార్డుకు మరమ్మతులకు పంపించాలంటేనే అనేక సంస్థలు ఆలోచించడం మొదలుపెట్టాయి. ఫలితంగా హెచ్‌ఎస్‌ఎల్‌కు ఆర్డర్లు రావడం తగ్గుముఖం పట్టడంతో ప్రతిష్టకు భంగం కలిగింది.
రికార్డు స్థాయిలో మరమ్మతులు పూర్తి చేసినా...
సింధుకీర్తి కారణంగా ఎదురైన అవమానాలను భరించి.. మరమ్మతుల విషయంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఆధునిక సాంకేతికతని అందిపుచ్చుకుంటూ.. నిర్దేశించిన కాలపరిమితిలోపే రీఫిట్ పనులను పూర్తి చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయినా ఆర్డర్ల విషయంలో నిరాశే ఎదురైంది. మరోసారి భారత నౌకాదళం చొరవ తీసుకొని సింధువీర్ సబ్‌మెరైన్ మరమ్మతుల బాధ్యతను షిప్‌యార్డుకు అప్పగించింది. రికార్డు స్థాయిలో కేవలం 27 రోజుల్లోనే రీఫిట్ పనుల్ని పూర్తి చేసి సబ్‌మెరైన్‌ను నేవీకి అప్పగించడంతో హెచ్‌ఎస్‌ఎల్‌పై విశ్వాసం పెరిగింది. ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసుకోలేదు
22 నెలల్లో పూర్తి చేసుందుకు కసరత్తు
ఎలాంటి నౌకలు, సబ్‌మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్‌ఎస్‌ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనులను ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. ఇప్పటి వరకూ 200 నౌకలు తయారు చేసిన షిప్‌యార్డు.. తాజాగా 2000 షిప్స్ మరమ్మతులను కూడా పూర్తి చేసింది. అయినప్పటికీ సింధుకీర్తి మరమ్మతుల అపవాదు వెంటాడుతూనే ఉంది. దాన్ని పూర్తిగా చెరిపేసే అవకాశం షిప్‌యార్డుకు వచ్చింది.
సుదీర్ఘ విరామం తర్వాత సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల కోసం షిప్‌యార్డుకు చేరుకుంది. 2015 తర్వాత వచ్చిన సింధుకీర్తి రీఫిట్ పనుల్ని 22 నెలల్లో పూర్తి చేస్తామంటూ రక్షణ మంత్రిత్వ శాఖతో హెచ్‌ఎస్‌ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ సబ్‌మెరైన్ విషయంలో అపవాదు మూటకట్టుకుందో.. అదే సబ్‌మెరైన్ రీఫిట్ పనుల్ని నిర్ణీత సమయం కంటే ముందుగానే పూర్తి చేసేందుకు షిప్‌యార్డు సన్నద్ధమవుతోంది. పోయిన ప్రతిష్టని, కీర్తిని, సింధుకీర్తి మరమ్మతులతోనే దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని సీఎండీ హేమంత్ ఖత్రీ అన్నారు. 22 నెలల కంటే ముందుగానే అప్పగించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment