Shravana Masam 2021 Telugu Calendar: Shubha Muhurthams List - Sakshi

నేటి నుంచి శ్రావణమాసం.. శుభ ముహూర్తాలు ఈ రోజుల్లోనే

Aug 9 2021 8:50 AM | Updated on Aug 9 2021 6:11 PM

Sravana Masam: Shubh Muhurat And Other Details - Sakshi

సాక్షి, అనంతపురం : మహిళలు అత్యంత ప్రీతికరంగా భావించే నోముల మాసం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. కోయిలమ్మ కుహు రాగాలతో స్వాగతం పలుకుతుండగా.. పాడి పంటలతో జిల్లా వాసులను సుసంపన్నం చేసేందుకు వర్ష రుతువూ రానే వచ్చేసింది. నోములకు, పేరంటాలకు ఈ మాసం సుప్రసిద్ధం. జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం వంటి చోట్ల ఆర్యవైశ్యులు వాసవీ మాతకు విశేష అలంకరణలు, పూజలు నిర్వహిస్తుంటారు. కరోనాకు ముందు టీటీడీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఏర్పాటు చేసేవారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది కూడా కొనసాగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. 

ప్రధాన పండుగలన్నీ ఈ మాసంలోనే 
ఈ నెల 9 నుంచి సెప్టెంబర్‌ 7వ తేదీ వరకూ కొనసాగే శ్రావణ మాసంలో ప్రతి ఇల్లూ ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. ప్రతి మంగళ,  శుక్రవారాల్లో ఆధ్యాత్మిక కాంతులు వెలుగులీనుతాయి. ప్రధానంగా శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో భాజాభజంత్రీలు శ్రవణానందకరంగా మోగనున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో నాగుల చవితి, గరుడ పంచమి రాకతో ప్రధాన పండుగలు ఆరంభం కానున్నాయి. 14న లక్ష్మీవేంకటేశ్వర వ్రతం, 15న నారసింహ వ్రతం, 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణ పౌర్ణిమ, రాఖీ పర్వదినం, 24న వెంకయ్య స్వామి ఆరాధన, 23 నుంచి మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు, 30న కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్‌ 6న పొలాల అమావాస్యతో శ్రావణం ముగిసి భాద్రపదం ప్రవేశిస్తుంది.  

ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి 
ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే కట్టుబాట్లు, నియమాలు ప్రతివారికీ తగిన వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని అందించేవిగా ఉంటాయి. ముఖ్యంగా పసుపు కుంకుమల వినియోగం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. ఈ నెల 11, 13, 15, 18, 20, 22, 25, 27, 31, వచ్చే నెల 1, 4, 5 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయి.  
– గరుడాద్రి సురేష్‌ శర్మ, వేద పండితులు

వివాహాలకు, శుభాకార్యాలకు  మంచి రోజులు..
ఈనెలలో 11, 12, 13, 14, 18, 19, 20, 25, 26, 27, సెప్టెంబర్‌ 1 తేదీలు పెళ్లిళ్లకు, ఇతర శుభాకార్యాలు జరుపుకోవడానికి మంచి రోజులు.

గృహ నిర్మాణ పనులకు.. 
ఈనెలలో 11,15,18,20,23,25,27, సెప్టెంబర్‌ 1 తేదీలు గృహ నిర్మాణ పనులకు అనువైన రోజులు.

గృహ ప్రవేశాలకు.. 
ఈనెలలో 15, 20, 27 తేదీలు గృహ ప్రవేశాలకు అనువైన రోజులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement