చిన్నారి ఇంద్రజ పరిస్థితిని తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్)
సాక్షి, శ్రీకాకుళం: వినతిపత్రాలు తీసుకోవడం.. చూద్దాం, చేద్దాం.. అని దాటవేసే నేతల తీరుకు అలవాటు పడిన రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ స్పందిస్తున్న తీరు అద్భుతంగా కనిపిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఆరోగ్య సమస్యలతో చేయూత కోసం తన వద్దకు ఎవరు.. ఏ సమయంలో వచ్చినా ఆయన అక్కున చేర్చుకుని తక్షణ వైద్య సహాయం అందేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వం నుంచి భరించేందుకు సై అంటున్నారు. దానికి తాజా ఉదాహరణ ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారి ఇంద్రజ.
తల అసాధారణంగా పెరిగిపోయే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ పాపను తల్లిదండ్రులు ఈ నెల 23న నరసన్నపేట వచ్చిన సీఎం వద్దకు తీసుకెళ్లి తమ గోడు విన్నవించుకోవడమే ఆలస్యం.. సీఎంవో నుంచి కలెక్టర్ వర కు ముఖ్యమంత్రి అందరినీ ఉరుకులెత్తించారు. దాంతో అదే రోజు రాత్రి నుంచి జెమ్స్‌లో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్సకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష చెక్కును కూడా బాలిక తల్లిదండ్రు లకు ఇచ్చారు. ఇవన్నీ చూసి బాలిక తల్లిదండ్రులతో పాటు వారి గ్రామ ప్రజలు అబ్బుర పడుతున్నారు. మేనమామలా ఆదుకుంటానని ఇచ్చిన హామీని వైఎస్ జగన్ అక్షరాలా అమలు చేస్తూ ఆ కుటుంబంలో వెలుగులు నింపుతూ దేవుడు మామయ్యనని అనిపించుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
నవంబర్ 23 ఇంద్రజ తల్లితో చర్చిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్
హామీ ఇచ్చిన క్షణం నుంచే...
► ఈ నెల 23న నరసన్నపేటలో తమ కుమార్తె ఇంద్రజను ఆదుకోవాలంటూ సీఎం జగన్‌ను బాధితురాలి తల్లిదండ్రులు కోరారు.
► పది నిమిషాలకే సీఎం జగన్ నేరుగా వారితోనే మాట్లాడి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి నయం చేస్తామని భరోసా అందించారు.
► అదే రోజు సాయంత్రం 7 గంటలకు కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి.. డీఎంహెచ్‌వో మీనాక్షి పర్యవేక్షణలో ఇంద్రజను జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
►అదే రోజు రాత్రి 10 గంటల నుంచే జెమ్స్‌లో ఇంద్రజకు ప్రాథమిక వైద్య పరీక్షలు ప్రారంభించారు. న్యూరో సర్జన్ వైద్య బృందాల సమీక్షించాయి.
►ఈ నెల 24న జెమ్స్ ఆసుపత్రిలో ఇంద్రజకు ఉన్న వ్యాధి హైడ్రోసిఫలిస్ అని నిర్ధారించారు.
►ఈ నెల 25న జెమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు నేరుగా వైద్య పరీక్షలు చేసి అవసరమైతే హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తామని ప్రకటించారు. తల్లిదండ్రుల నిర్ణయం మేరకు దేశంలో ఎక్కడైనా ఆపరేషన్ చేయించాలంటూ సీఎం కార్యాలయం నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్టుగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చిన్నారికి వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విశాఖలో చేయాలా, విజయవాడలోనా.. హైదరాబాద్‌లోనా అన్నది మీరే నిర్ణయించుకోవాలని కలెక్టర్ ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఆప్షన్ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్ అందజేశారు.
మా కుటుంబానికి దేవుడు...
మా కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవుడు. 11 ఏళ్లుగా ఇంద్రజ చికిత్స కోసం అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిప్పాను. ప్రయోజనం లేదు. దిక్కు తోచని స్థితి. వావిలవలసకు చెందిన పాలూరి సిద్ధార్థ నరసన్నపేటకు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. పాపతో కలిసి అక్కడ నిలబడి ఉండగా ముఖ్యమంత్రి జగనన్న చూసి పరుగున వచ్చి మా పాప పడుతున్న బాధను పరిశీలించారు. మా కుమార్తె ఆపరేషన్‌కు భరోసా ఇచ్చారు. నా భర్త అప్పలనాయుడు కిడ్నీరోగి. రాజమండ్రిలో ఉంటున్నారు. మాకు ముగ్గురు కుమార్తెలు. ఇంటి వద్దనే పెద్ద పాప ఆలనా, పాలనా చూసుకొని ఉంటున్నాను. ఓ వైపు బతకడం కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన చల్లగా ఉండాలి. –మీసాల కృష్ణవేణి, ఇంద్రజ తల్లి, చిన్నశిర్లాం, రేగిడి మండలం
Comments
Please login to add a commentAdd a comment