సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్వర్ల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేయడం సోమవారం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణకు కలిపి హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ సర్వర్ వ్యవస్థను విభజించారు. గత రెండు రోజులుగా చేస్తున్న విభజన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని మంగళగిరిలో ఉన్న పై–డేటా సెంటర్‌కి డేటాబేస్‌ను మార్చారు. ఇక్కడ సర్వర్ల సామర్థ్యాన్ని గతంకన్నా పెంచి డేటాబేస్‌ను సిద్ధం చేశారు. ఈ సర్వర్లపైనే సోమవారం టెస్టింగ్ కింద రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వరకు టెస్టింగ్‌లో భాగంగానే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.
మార్చిన సర్వర్‌లో వస్తున్న సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వర్ స్పీడ్ ఎలా ఉంది, ఎప్పుడు తగ్గుతుంది, వేలిముద్రల స్కానింగ్, వెబ్‌ల్యాండ్, స్టోరేజీ తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో 48 గంటల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం నుంచి మార్చిన సర్వర్ వ్యవస్థ ద్వారా పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి సర్వర్‌తో ఇక్కట్లు
సెంట్రల్ సర్వర్ వ్యవస్థ తెలంగాణతో కలిసి ఉండడం వల్ల ఇప్పటివరకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్వర్ల సామర్థ్యం సరిపోక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు తరచూ ఇబ్బందులు ఏర్పడేవి. రోజుల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఉదంతాలున్నాయి. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ సర్వర్ వ్యవస్థను విభజించి మన రాష్ట్రంలో కొత్త డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రోజూ జరిగే రిజిస్ట్రేషన్లు, అవసరమైన స్టోరేజీ తదితర వాటికి అనుగుణంగా సర్వర్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచారు. దీనివల్ల ఇకపై సర్వర్ సమస్యలు ఉండవని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment