తమ ఏలుబడి కొనసాగినన్నాళ్లూ లెక్కలేనన్ని దుర్మార్గాలు.. దారుణాలు. ప్రత్యర్థులను అడుగడుగునా వెంటాడి వేధించే ప్రతీకార ధోరణులు. వారి అంతానికి అంతులేని పన్నాగాలు. మాటలతో హింసించే తీరును అటుంచితే.. అధికార దురహంకారంతో దాడులు.. దురాగతాలు. చట్టమంటే లెక్కలేక.. నియమాలకు దిక్కులేక.. ఆ ఐదేళ్ల కాలంలో అచ్చెన్నాయుడు టీమ్ ఉక్కు పిడికిళ్లలో నలిగిపోయిన సామాన్యులు. ప్రాణరక్షణ కరువై.. బతుకే బరువై దినమొక యుగంలా కాలం గడిపిన ఎందరో నేతలు. అయితే చిత్రమైన తీరులో అధికారం మారినా ఆనాటి అరాచకాలు మారకపోవడమే.. అప్పటి దురహంకారుల జోరు తగ్గకపోవడమే.. విస్తు గొలుపుతోంది. ఈ అకృత్యాలకు అదనంగా ఇప్పుడు అధికారులపై అధికారంలోని పాలకులపై నోరుపారేసుకోవడం పెరిగింది. ఈ వైఖరి సకల ప్రజలను నివ్వెరపరుస్తోంది. అవే అరాచకాలు ఇంకా ఎన్నాళ్లన్న భావన అందరిలో మెదులుతోంది.
సాక్షి, శ్రీకాకుళం: చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రతిపక్షాలకు చెందిన నాయకులపై దాడులకు దిగిన టీడీపీ నేతలు అధికారం పోయాక కూడా ఆగడాలు ఆపడం లేదు. అదే దూకుడుతో వ్యవహరిస్తూ ఎదుటోళ్లపై నిందలేయడం, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. ఇష్టారీతిన గాయపరిచి, తిరిగి తమపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటూ గగ్గోలుపెడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు పక్కన పెడితే కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లు భయభ్రాంతులకు గురి చేసేలా అధికారులపై విరుచుకుపడ్డారు. తిరిగి అధికారులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని, కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బుకాయింపునకు దిగుతున్నారు.
అధికారులకు బెదిరింపులు..
‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తా.’ అంటూ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించిన ఘటన చూశాం. ‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్‌లెస్ ఫెలో’’ అని రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికీ కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయిన విషయం తెలిసిందే.
ఇలా నోటికి, చేతికి పని చెప్పి దాడులు చేస్తున్నారు. అధికారం లేకపోయినా కూడా బరితెగిస్తున్నారు. ఆ మధ్య జలుమూరు మండలం అల్లాడపేటలో సాధారణ ఎన్నికలకు ముందు పార్టీ మారారన్న అక్కసుతో మాజీ సర్పంచ్ అచ్చయ్యపై టీడీపీ నేతలు అతి కిరాతకంగా కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. మహిళ అని చూడకుండా అచ్చయ్య మరదలు, తమ్ముడిపై కూడా దౌర్జన్యానికి దిగారు.
► సంతకవిటి మండలం శ్రీ హరినాయుడుపేటలో గతేడాది అక్టోబర్ 13న వలంటీర్ వావిలపల్లి నారాయణరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోరంబోకు భూములను ఆక్రమించేందుకు యతి్నస్తున్నారని అధికారులకు సమాచారమిచ్చారన్న అక్కసుతో వలంటీర్‌పై దాడి చేశారు. ఇదే మండలం కృష్ణంవలసలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారని అక్కసుతో ముద్దాడ బాలకృష్ణ, ముద్దాడ వీరన్న, దాసరి సింహాచలం, ముద్దాడ దుక్కన్నలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ముద్దాడ జోగులు, ముద్దాడ రాములు, కిక్కర సూర్యారావుల ఇళ్లపై కూడా దాడి చేశారు. శ్రీహరినాయుడుపేటలో తాగునీటి పైపులైన్ బాగు చేస్తున్న సందర్భంలో 15 మంది టీడీపీ కార్యకర్తలు సామూహిక దాడి చేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
► రేగిడి మండలం కాగితాపల్లిలో సెప్టెంబర్ 9న వలంటీర్ కిమిడి గౌరీశంకర్‌పై టీడీపీ నాయకులు దాడి చేశారు.
► టెక్కలి మండలం చాకిపల్లిలో కుమారస్వామి, అప్పన్న అనే ఇద్దరు వలంటీర్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
► సంతబొమ్మాళికి చెందిన కళింగపట్నం ఆశ అనే వలంటీర్‌పై దాడి చేశారు.
► పలాస మండలం కిష్టిపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు జి.మోహనరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
► తాజాగా నిమ్మాడలో తమకు ప్రత్యరి్థగా నామినేషన్ వేస్తున్నారన్న అక్కసుతో సమీప బంధువు కింజరాపు అప్పన్నను హతమార్చే కుట్రతో దాడి చేశారు.
పాపం పండటంతో అరెస్టులు..
కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన మందు బిల్లులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ నివేదిక మేరకు ఏసీబీ అధికారులు గతంలో అచ్చెన్నను అరెస్టు చేశారు. నీరు చెట్టు, చంద్రన్న బీమా, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల రూపకల్పన, వివిధ అభివృద్ధి పనుల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో హరిప్రసాద్‌కు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి. రోజులన్నీ ఒకేరకంగా ఉండవు. చేసిన తప్పులు ఊరకనే పోవు. ఏదో ఒక రోజున బయటపడక తప్పదు. ఈ క్రమంలోనే నిమ్మాడ ఘటనలో అడ్డంగా దొరికిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు బలమైన ఆధారాలతో అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment