రైల్వే కాంట్రాక్టుల కోసం ఉన్నతాధికారులకు భారీగా ముడుపులిచ్చి నట్లు సీబీఐ అనుమానం
ఈ కేసులో ఇప్పటివరకూ 17 మందిపై ఎఫ్‌ఐఆర్
డీఆర్‌ఎంతోపాటు నలుగురు అధికారులు, ఇద్దరు కాంట్రాక్టర్లు ఇప్పటికే అరెస్టు
అగ్రిమెంటు నుంచి బిల్లుల చెల్లింపు వరకూ 10 శాతం లంచాలు
500కు పైగా అగ్రిమెంట్లు పరిశీలించిన సీబీఐ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలోనే సంచలనం సృష్టించిన రైల్వే అధికారుల లంచాల కేసులో రోజుకో కొత్త వ్యక్తి పేరు వెలుగుచూస్తోంది. గుంతకల్లు రైల్వే డివిజనల్ అధికారులు కాంట్రాక్టు పనులు ఇచ్చేందుకు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఇటీవల సీబీఐ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌తో పాటు మరో నలుగురు అధికారులు, ఇద్దరు కాంట్రాక్టర్లను సీబీఐ ఇప్పటికే అరెస్టుచేసింది. లంచాల వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో కొత్తకొత్త పేర్లు బయటకొస్తున్నాయి.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పారీ్టకి చెందిన ఒక కాంట్రాక్టరు కూడా కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గం కొట్టాల గ్రామానికి చెందిన సదరు కాంట్రాక్టరు గత పదిహేనేళ్లుగా రైల్వే కాంట్రాక్టులు చేస్తున్నారు. రైల్వే అధికారులకు ముడుపులు చెల్లించి కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం, మిగతా కాంట్రాక్టర్లను దగ్గరకు కూడా రానివ్వకపోవడం వంటివి చేసేవారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఈ కాంట్రాక్టరు రింగు లీడర్‌గా వ్యవహరించే వారని, గడిచిన నాలుగేళ్లలో రూ.150 కోట్ల విలువైన పనులు చేసినట్లు సమాచారం.
హుటాహుటిన హైదరాబాద్‌కు..
ఈ నేపథ్యంలో.. టీడీపీకి చెందిన సదరు కాంట్రాక్టరు పేరు సీబీఐ అధికారుల పరిశీలనలో ఉండటంతో అతను హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లినట్లు ఇక్కడి కాంట్రాక్టర్లు చెబుతున్నారు. లంచాల వ్యవహారంలో ఇప్పటివరకూ 17 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. అందులో తన పేరు లేకుండా చేసుకునేందుకు సదరు కాంట్రాక్టరు భారీస్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ఇతని ఆధిపత్యాన్ని భరించలేకే కొంతమంది కాంట్రాక్టర్లు సీబీఐని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. డీఆర్‌ఎం (డివిజనల్ రైల్వే మేనేజర్), డీఎఫ్‌ఎం (డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్)లకు ఇతనే భారీగా ముడుపులిచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈయన చేసిన కాంట్రాక్టుల వివరాలన్నీ సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు.
2014 నుంచి డాక్యుమెంట్ల పరిశీలన..
మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి పాత వివరాలన్నీ సీబీఐ అధికారులు తోడుతున్నారు. 2014 నుంచి 2024 మార్చి వరకు జరిగిన కాంట్రాక్టుల అగ్రిమెంట్లన్నీ పరిశీలిస్తున్నారు. సుమారు 500 వరకూ అగ్రిమెంటు కాపీలు స్వా«దీనం చేసుకున్నారు. పనులు చేయకపోయినా బిల్లులు చేసుకున్నట్లు గుర్తించారు.
ఒక్కో కాంట్రాక్టు పనికి సంబంధించి అగ్రిమెంటు దశలో 1 శాతం, ఇంజినీర్లకు 2 శాతం, ఫైనాన్స్ మేనేజర్‌కు 2 శాతం.. ఇలా కాంట్రాక్టు అగ్రిమెంటు నుంచి బిల్లుల చెల్లింపు పూర్తయ్యే వరకూ 10 శాతం వరకూ లంచాలు ముట్టాయి. అంటే.. రూ.100 కోట్ల పనులు చేస్తే రూ.10 కోట్ల వరకు లంచాల రూపంలో అధికారులకే ముట్టాయి. దీంతో గడిచిన పదేళ్లలో రైల్వే డివిజన్ పరిధిలో జరిగిన అన్ని పనులను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ముడుపులు రూ.వందల కోట్లలో చెల్లించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment