
మరో మూడు రోజులు ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా పలుచోట్ల 43–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 174 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రాజాం (విజయనగరం)లో 45.5, కొండయ్యగూడెం (అల్లూరి జిల్లా)లో 45.1, కాజీపేట (వైఎస్సార్)లో 44.7, కోడుమూరు (కర్నూలు)లో 44.2, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, నందరాడ (తూర్పు గోదావరి), రావిపాడు (పల్నాడు), కొల్లివలస (శ్రీకాకుళం)లలో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల 43–44 డిగ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలున్నాయి. కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం బలహీన పడింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా తమిళనాడు ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రలో ఒకట్రెండుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.