శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రబాబు పాలనలో 2014 – 19 మధ్య కాలంలో రూ.1.62 లక్షల కోట్ల నిధుల్లో పెద్ద భాగం పక్కదోవ పట్టాయని, దీనిపై దేశ అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. టీడీపీ చేసిన నిధుల దుర్వినియోగంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రూ. 1.62 లక్షల కోట్లకు కాగ్ వివరణ అడిగితే కేవలం రూ.51,667 కోట్లకే బాబు ప్రభుత్వం వివరణ ఇచ్చిందన్నారు. మిగతా డబ్బు సంగతి తేలలేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లించారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో గణాంకాలతో సహా వెల్లడించారని స్పీకర్ గుర్తు చేశారు.
ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును టీడీపీ నేతలు తప్పుడు లెక్కలతో పక్కదారి పట్టించారని ఆరోపించారు. టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన వివరణలో నాటి ప్రభుత్వం డొల్లతనం బయటపడిందని తెలిపారు. బాబు ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు టీడీపీ నేతలు ఎంపీ కనకమేడల ద్వారా ప్రయత్నించారని, వాస్తవాలు కేంద్రంతో పాటు జనాలకు కూడా తెలుసని చెప్పారు. అధికార పక్షాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నించి టీడీపీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు. లక్ష కోట్లకు పైగా డబ్బుకు లెక్క చెప్పలేని తెలుగుదేశం నేతలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాలోకే జమ చేసిందని గుర్తు చేశారు. సచివాలయాల ద్వారా మధ్యవర్తుల అవసరం లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిందని తెలిపారు. జనం ఎప్పుడూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉన్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment