తిరుమలను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ప్రకటించాలి
స్వామీజీలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతుల డిమాండ్
సాక్షి, అమరావతి: తిరుమలలో 7 నెలలుగా చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలపై స్వామీజీలు, హైందవ పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలిని వెంటనే రద్దు చేయాలని, తిరుమలను స్వతంత్ర ప్రతిపత్తి గల ఆధ్యాతి్మక కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వధర్మ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ‘తిరుమల తాజా పరిణామాలు–పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సోమవారం వెబినార్ జరిగింది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వామీజీలు, పీఠాధిపతులు, హైందవ సంఘాల ప్రతినిధులు వర్చువల్‌గా హాజరయ్యారు. తిరుమలలో సాధారణ భక్తులను చాలా చులకనగా చూస్తున్నారని, పాలకమండలి సభ్యుల్లో కొందరు కొండపై వ్యాపారులకు లబ్ధి చేస్తూ క్విడ్‌ప్రోకోకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. 7 నెలల్లో కొండపై జరిగిన అవాంఛనీయ ఘటనలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ, తిరుమల వైశిష్టతను కాపాడుకునేందుకు ధారి్మక సంఘాలు, స్వామీజీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ వెబినార్‌లో ఎవరేమన్నారంటే..
హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
తిరుమలలో చోటుచేసుకుంటున్న ఘటనల వల్ల తిరుమల ప్రతిష్టకే విఘాతం కలుగుతోంది. భక్తుల సొమ్ముతో పాలకమండళ్లకు, అధికారులకు విలాసాలు కల్పిస్తున్నారు. ప్రతిరోజూ 18 గంటల్లో 60 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు. అంటే ఒక్కో భక్తుడికి కేవలం ఒక సెకను మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులను ఒకేసారి బయటకు వదలడం వల్ల ఆరుగురు తొక్కిసలాటలో మృతి చెందారు. తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి.
– వీవీఆర్ కృష్ణంరాజు, స్వధర్మ విజ్ఞాన వేదిక చైర్మన్
తిరుమల నిఘా వ్యవస్థలో వైఫల్యం
తిరుమలలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. స్వామి ప్రసాదంపైనా దారుణమైన ఆరోపణలను విన్నాం. స్వామి సన్నిధిలో నిఘా వ్యవస్థలో వైఫల్యం కనిపిస్తోంది. ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఆగమ శాస్త్ర నిపుణులతో టీటీడీ ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవాలి. – గౌర కృష్ణ స్వామిజీ, పెదముత్తేవి
తిరుమల ఘటనలు బాధాకరం
తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట, తిరుమలలో బాలుడు చనిపోవడం వంటి ఘటనలు బాధాకరం. కేబినెట్ ర్యాంక్‌తో కూడిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకే సాధారణ దర్శనం కల్పించారు. ఆయన ప్రవచనాన్నీ చివరి నిమిషంలో రద్దు చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు. – పొక్కులూరి సుబ్బారావు, చైర్మన్, గీతా విజన్ ట్రస్ట్
రాజకీయ నేతలు ఉండకూడదు
సామాన్యులు, వీఐపీలంటూ భగవంతుని సమక్షంలో విభజన చేయడమే తప్పు. పాలకమండళ్లలో రాజకీయ నాయకులు ఉండటం వల్ల భక్తులు భగవంతుడికి దూరమవుతున్నారు. పాలక మండలిలో రాజకీయ పెత్తనం ఉండకూడదు. స్వతంత్ర వ్యవస్థ అంటే స్వామీజీ వ్యవస్థ ఉండటం వల్ల పూజాధికాలతో పాటు భక్తులు స్వామివారికి దగ్గరయ్యే మార్గాలను సూచిస్తారు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలపై ఆగమ పండితులతో ఇప్పటివరకు కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం బాధాకరం. దీనిపై టీటీడీని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాం. – వెంకట సత్యనారాయణ ప్రసాద స్వామీజీ, తాళ్లూరి మఠం పీఠాధిపతి, భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు
పాలకమండలిలో క్రిమినల్స్, వ్యాపారవేత్తలా?
టీటీడీ పాలకమండళ్లలో వ్యాపారవేత్తలు, క్రిమినల్స్ ఉండటం దురదృష్టకరం. ప్రభుత్వాలకు దేవాలయాలపై పెత్తనం చేసే హక్కు లేదు. ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. – డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు, చైర్మన్, రామానుజ సంక్షేమ సమితి
ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమించాలి
టీటీడీలో పరిణామాలపై ప్రజలను జాగృతం చేస్తూ స్వామీజీలు, ధార్మిక సంఘాలు ఉద్యమించాలి. చిలుకూరి బాలాజీ వంటి ఆలయాల్లో భక్తులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. అన్ని ఆలయాల్లో అలాంటి పద్ధతులను ప్రవేశపెట్టాలి. – తుర్లపాటి నాగభూషణరావు, కో–కన్వీనర్, హిందూ ధర్మపరిరక్షణ సమితి
Comments
Please login to add a commentAdd a comment