తిరుపతి, సాక్షి: తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది . ఉచిత సర్వ దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 2 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) 77,939 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 22,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.50 కోట్లుగా లెక్క తేలింది.
కల్పవృక్ష వాహనంపై గణనాథుడు
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ప్రత్యేక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం విశేషపూజలు అందుకున్న శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ, మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, పంబ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగింపు అట్టహాసంగా సాగింది. ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా వేకువజామున ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకం చేశారు. పట్టుపీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపు ప్రారంభమైంది. భక్తులు కనులారా స్వామివారి సేవను తిలకించారు.
నేడు పూలంగిసేవ..
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి గురువారం పూలంగిసేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ గురుప్రసాద్ తెలిపారు. ఉదయం అభిషేకం, రాత్రి పూలంగిసేవ జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment