Tobacco Farmers Happy As They Got Good Tate In The Market - Sakshi
Sakshi News home page

Tobacco: పొగాకు రైతుకు కలిసొచ్చిన వేళ

Published Mon, Jul 4 2022 8:41 PM | Last Updated on Mon, Jul 4 2022 9:07 PM

Tobacco Farmers Happy As They Got Good Tate In The Market. - Sakshi

పొగాకు రైతుకు ఈ ఏడాది కలిసొచ్చింది. మార్కెట్లో మంచి రేటు లభించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ ఏడాది కిలో పొగాకు సరాసరి రూ..178 రాగా గత సంవత్సరం సరాసరి రూ.141లు లభించింది. రైతు ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇదిలా ఉండగా  పొగాకు వేలం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల రెండో వారంలో వేలం ముగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

కందుకూరు/ఒంగోలు సబర్బన్‌: అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండడంతో పొగాకు మార్కెట్‌ ఆశాజనకంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం పరిధిలోని అన్ని వేలం కేంద్రాల్లో అన్ని గ్రేడ్‌ల పొగాకును వ్యాపారుల పోటీపడి మరీ కొనుగోలు చేయడంతో రైతులు ఆశించిన స్థాయిలోనే ధరలు నమోదయ్యాయి. కందుకూరు వేలం కేంద్రాలు బోర్డు పరిధిలో నంబర్‌ వన్‌గా నిలిచింది. బ్రైట్‌ గ్రేడ్‌ కేజీ పొగాకు ధర సీజన్‌ మొత్తం రూ.186 వద్ద స్థిరంగా ఉండగా, మొదట్లో రూ.120 పలికిన లోగ్రేడ్‌ పొగాకు చివరికి వచ్చే సరిసరి రూ.110లుగా పలికింది. 

దీంతో కేజీ పొగాకు సరాసరి ధర ఇప్పటి వరకు కందుకూరు–1లో రూ.178.38, కందుకూరు–2లో రూ.178.46 వచ్చింది. మిగిలిన అన్ని వేలం కేంద్రాల్లోను రూ.167ల నుంచి రూ.174ల పరిధిలోనే ఉన్నాయి. మిగిలిన వేలం కేంద్రాలతో పోల్చుకుంటే కందుకూరు వేలం కేంద్రాల్లో సరాసరి ధరలు రూ.4 నుంచి రూ.11 వరకు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది మంచి లాభాలతో పొగాకు సీజన్‌ను ముగించేందుకు రైతులు సిద్ధమయ్యారు. మిగిలిన పంటలు దారుణంగా దెబ్బతీసిన నేపథ్యంలో పొగాకు ఈ ఏడాది రైతులను ఆర్థికంగా నిలబెట్టిందని భావిస్తున్నారు.  

స్థిరంగా మార్కెట్‌: ఈ ఏడాది వేలంలో భారీ ఒడిదుడుకులు ఏమీ లేకుండా పొగాకు మార్కెట్‌ స్థిరంగా కొనసాగింది. పొగాకు ఉత్పత్తి తగ్గి రైతులు ఆశించిన స్థాయిలోనే రేట్లు రావడంతో వేలం ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. దీంతో ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలో వేలం ప్రక్రియ అటూ ఇటుగా రెండు నెలల వ్యవధిలోనే ముగించగలిగారు. ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 39.47 మిలియన్‌ కేజీల పొగాకు ఉత్పత్తులను అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉండగా దిగుబడి తగ్గడంతో 33.16 మిలియన్‌ కేజీల ఉత్పత్తి మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేశారు. 

దీనికిగాను ఇప్పటికే 32.74 మిలియన్‌ కేజీల పొగాకు విక్రయాలు పూర్తికాగా ఇంకా 0.78 మిలియన్‌ కేజీల పొగాకే మిగిలి ఉంది. ఇక కందుకూరు పరిధిలోని వేలం కేంద్రాల్లో మాత్రమే వేలం కొనసాగుతోంది. అత్యధిక పొగాకు ఈ రెండు వేలం కేంద్రాల్లోనే ఉండడంతో వేలం ఆలస్యమవుతోంది. వీటిలో కందుకూరు–1వ వేలం కేంద్రం పరిధిలో 8.03 మిలియన్‌ కేజీల పొగాకుకు అనుమతి ఉంటే 8.10 మిలియన్‌ కేజీల ఉత్పత్తి వస్తుందని అంచనా. 

దీనిలో ఇప్పటి వరకు 7.43 మిలియన్‌ కేజీలను అమ్మగా, ఇంకా 0.67 మిలియన్‌ కేజీల ఉత్పత్తులు అమ్మాల్సి ఉంది. ఈనెల 16వ తేదీ నాటికి ముగించనున్నారు. కందుకూరు–2లో 6.80 మిలియన్‌ కేజీలకు అనుమతి ఉంటే 6.70 మిలియన్‌ కేజీల ఉత్పత్తి వస్తుందని అంచనా. దీనిలో ఇప్పటికే 6.59 మిలియన్‌ కేజీలను విక్రయించగా ఇంకా 0.11 మిలియన్‌ కేజీలు అమ్మాల్సి ఉంది. ఈనెల 6వ తేదీ నాటికి వేలం ముగియనుంది. మొత్తం మీద రెండో వారం కల్లా ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలోని వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ పూర్తి కానుంది.  


 
చివరి దశలో వేలం.. 
పొగాకు వేలం పూర్తికావస్తోంది. దక్షిణ ప్రాంత తేలిక నేలల (ఎస్‌ఎల్‌ఎస్‌) పరిధిలో మొత్తం 6 వేలం కేంద్రాలుంటే నాలుగు కేంద్రాల్లో ఇప్పటికే పొగాకు వేలాన్ని ముగించారు. పొదిలి, కనిగిరి, కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో వేలం ముగియగా కందుకూరు రెండు వేలం కేంద్రాల్లో మరో పది రోజుల్లో వేలం ముగియనుంది. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్‌ పరిధిలో 11 వేలం కేంద్రాల్లో 67.74 మిలియన్‌ కేజీల పొగాకును కొనుగోలు చేయగా ఇంకా కేవలం 6.27 మిలియన్‌ కేజీల ఉత్పత్తులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని ఈనెల మూడోవారంకల్లా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.    
టంగుటూరు పొగాకు వేలం క్రేందంలో శనివారం 681 పొగాకు బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. కారుమంచికి చెందిన రైతులు 718 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 681 కొనుగోలు చేశారు. 35 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.188 కాగా, కనిష్ట ధర రూ.110, సరాసరి ధర రూ.182.70 పలికింది. వేలంలో మొత్తం 17 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.   

కొండపి వేలం కేంద్రంలో శనివారం 731 పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. అనకర్లపూడి, ముప్పరాజుపాలెం, పెరిదేపి, మిట్టపాలెం, అక్కచెరువుపాలెం, గోగినేనివారిపాలెం, చోడవరం, ముప్పవరం, రామచంద్రాపురం, కట్టావారిపాలెం, నర్సింగోలు గ్రామాల నుంచి రైతులు 930 బేళ్లు వేలానికి తెచ్చారు. 731 బేళ్లు కొనుగోలు చేసి, 179 బేళ్లు తిరస్కరించారు. అత్యధిక ధర కేజీ పొగాకు రూ.187 పలకగా, అత్యల్పం రూ.110, సరాసరి ధర రూ.179.17 వచ్చింది.  

ఎస్‌బీఎస్‌ పరిధిలో...  
ఎస్‌బీఎస్‌ పరిధిలో ప్రకాశం జిల్లా పరిధిలోని వెల్లంపల్లి, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 41.25 మిలియన్‌ కేజీల పొగాకుకు అనుమతి ఉండగా 40.50 మిలియన్‌ కేజీ ఉత్పత్తి వస్తుందని అంచనా. ఇప్పటికే 35.00 మిలియన్‌ కేజీల ఉత్పత్తుల అమ్మకాలు పూర్తిగా కాగా ఇంకా 5.49 మిలియన్‌ కేజీల పొగాకును అమ్మాల్సి ఉంది. ఈనెల 20వ తేదీకల్లా పూర్తిగా వేలాన్ని ముగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 

పొగాకు సాగే ఈ ఏడాది రైతులను ఆదుకుంది 
పొగాకు పంట సాగు ఈ సంవత్సరం రైతులకు కలిసొచ్చింది. గతంలో వరుసగా నష్టాలు వచ్చినా ఈ ఏడాది మార్కెట్‌ బాగుండడంతో మంచి లాభాలు వచ్చాయి. మంచి పొగాకు క్వింటా రూ.18,600ల వరకు వచ్చింది. లోగ్రేడ్‌ పొగాకు కూడా కాస్త ఆటూ ఇటుగా బ్రైట్‌ గ్రేడ్‌తో సమానంగా రేట్లు వచ్చాయి. దీని వల్ల యావరేజ్‌ ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం పొగాకు పంటే రైతులకు కాస్త ఆదాయాలు తెచ్చిపెట్టింది.  
– అనుమోలు రాములు, పొగాకు రైతు,పోలినేనిపాలెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement