జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో బాధితులకు చికిత్స
గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుధ్య పనులు
వైద్యారోగ్య శాఖాధికారుల సర్వే
తాజాగా.. మరో 11 కేసులు నమోదు
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/దాచేపల్లి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఐదు రోజులుగా దీనికి సంబంధించిన కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. సోమవారం జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అలాగే, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఓ వృద్ధురాలు కూడా అతిసార బారినపడి మరణించింది.
79 కేసులు నమోదు..
జగ్గయ్యపేట ప్రాంతంలో ఈనెల 19–24 వరకు మొత్తం 79 డయేరియా కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌ఓ సుహాసిని తెలిపారు. పట్టణంలో 30, మండలంలో 27, వత్సవాయి మండలంలో 22 కేసులు వచ్చాయని తెలిపారు. ఇందులో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 67 మందికి చికిత్స అందించగా మరో 12 మంది ఖమ్మం, కోదాడ, తదితర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఇక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 67 మందిలో 33 మందిని డిశ్చార్జ్ చేయగా మెరుగైన వైద్య నిమిత్తం 10 మందిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 24 మంది జగ్గయ్యపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె చెప్పారు.
మరోవైపు.. అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు సుహాసిని తెలిపారు. డయేరియాను అదుపు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని ఆమె కోరారు. అలాగే, అతిసార వ్యాపించిన గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డీసీకే నాయక్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ హరీష్, విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు అరీనా, స్థానిక వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పారిశుధ్య పనులు..
మరోవైపు.. జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ, గండ్రాయి గ్రామాల్లో పంచాయతీ అధికారులు ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. మంచినీటి ట్యాంకులు శుభ్రంచేయడంతో పాటు క్లోరినేషన్ చేస్తున్నారు. డ్రెయిన్‌లలో పూడికతీత, మురుగునీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్, దోమల వ్యాప్తిని నిరోధించే మందులను పిచికారీ చేస్తున్నారు. దీంతోపాటు.. డయేరియా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.
తాజాగా 11 కేసులు నమోదు..
జగ్గయ్యపేట మండలంలో సోమవారం వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 11 మందిని గుర్తించినట్లు వైద్యాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. వీరంతా బూదవాడ, ముక్త్యాల, రావిరాల.. వత్సవాయి మండలం మంగొల్లు, వేములనర్వ, పెద్దమోదుగపల్లి.. పట్టణంలోని సీతారాంపురం, చెరువుబజార్‌కు చెందిన వారు. గండ్రాయిలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రమణ తాగునీటి ట్యాంకులను పరిశీలించారు.
అతిసారతో వృద్ధురాలు మృతి..
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వంగూరి నాగమ్మ (62) అతిసార బారినపడి చికిత్స పొందుతూ సోమవారం మృత్యువాత పడింది. ఈ గ్రామంలో అతిసార బారినపడి 16 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల కిందట నాగమ్మ కూడా ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరింది. వాంతులు, విరేచనాలు అదుపులోకి రాకపోవడంతోపాటు కిడ్నీల సమస్య తలెత్తింది. దీంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ఆదివారం తరలించగా.. చికిత్స పొందుతూ మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
డయేరియా ప్రబలుతుంటే ఏం చేస్తున్నారు?: మంత్రి సత్యకుమార్
ఈ నేపథ్యంలో.. సోమవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు, కీటక జనిత వ్యాధులపై ఏపీ సచివాలయం నుంచి డీఎంహెచ్‌ఓలు, డీసీహెచ్‌ఎస్‌లు, జీజీహెచ్ సూపరింటెండెంట్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డయారియా కేసులు పెరుగుతుంటే క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు.
27 ఏళ్ల యువకుడు డయేరియాతో చనిపోతే ఏం సమాధానం చెప్తారని ప్రశి్నంచారు. ఈ పరిస్థితి చూసి సిగ్గుపడాలన్నారు. మున్ముందు వైద్యశాఖను ప్రక్షాళన చేసేలా చర్యలుంటాయన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీక్షలో వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ లక్షీషా, డీఎంఈ డాక్టర్ నరసింహం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment