AP: Union Minister Nitin Gadkari Inaugurates Flyover At Vijayawada - Sakshi
Sakshi News home page

Nitin Gadkari: సీఎం జగన్‌ గొప్ప ఆశయం ఉన్న నాయకుడు : నితిన్‌ గడ్కరీ

Published Thu, Feb 17 2022 4:26 PM | Last Updated on Thu, Feb 17 2022 6:10 PM

Union Minister Nitin Gadkari Inaugurates Flyover At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలోని బెంజ్‌​ సర్కిల్ ఫ్లై ఓవర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. డైనమిక్‌ సీఎం జగన్‌ నేతృత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ‍్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ప్రజలకు మంచి చేయాలన్న గట్టి ఆశయం ఉన్న నాయకుడు ఉంటే ఏదైనా సాధించగలరని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఏపీ సీఎం జగన్‌ కోరిన ఈస్ట్రన్‌ రింగు రోడ్డుకు ఇ‍ప్పుడే ఆమోదం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే.. 20 ఆర్‌ఓబీలకు బదులుగా 30 ఆర్‌ఓబీలను మంజూరు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఏపీలో రూ. 3 లక్షల కోట్ల విలువైన రోడ్లను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలను కేంద్రం నిర్మిస్తోందని వెల్లడించారు. భారత ఆర్థికాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తున్నట్టు గడ్కరీ తెలిపారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవేల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని వాజ్‌పేయి అన్నారని గుర్తు చేశారు. వాజ్‌పేయి హయంలోనే స‍్వర్ణ చతుర్భుబి నిర్మాణం ప్రారంభమైనట్టు తెలిపారు. 

2024 వరకు రాయపూర్‌-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను పూర్తి చేస్తామని ఆయన హామీనిచ్చారు.  2025 నాటికి రూ.15వేల కోట‍్లతో నాగ్‌పూర్‌-విజయవాడ హైవే పూర్తి చేయనున్నట్టు చెప్పారు. అభివృద్ధిలో ఓడరేవులు, రహదారుల కనెక్టివిటీ ఎంతో కీలకమని అన్నారు. మూడేళ్లలో రూ. 5వేల కోట్లతో చిత్తూరు-తంజావూరు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, రూ. 6వేల కోట్లతో హైదరాబాద్‌​-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, రూ. 17వేల కోట్లతో ఏపీ మీదుగా బెంగళూరు-చైన్నై హైవేల నిర్మాణాలను పూర్తి చేయనున్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ హైవే వల్ల కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. కొత్త హైవేలు పూర్తి అయితే స్పీడ్‌ లిమిట్‌ను సవరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. రోడ్లు బాగుంటే రవాణా వ్యయం భారీగా తగ్గుతుందన్నారు. చైనాతో పోలిస్తే భారత్‌లో రవాణా వ్యయం చాలా ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం నిర్వహిస్తున్న గ్రామ సడక్‌ యోజన ఇ‍ప్పుడు అత్యంత కీలకమన్నారు.

ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కీలకమైనవి, వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. రైతులు, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత తాను వ్యక్తిగతంగా ఏపీకి వస్తానని మంత్రి తెలిపారు. తాను జలవనరుల మంత్రి కానప్పటికీ పోలవరం ప్రాజెక్టును చూస్తానని అన్నారు. జలాలు సముద్రంలో కలవకముందే నదులను అనుసంధానించుకుందామని గడ్కరీ సూచించారు. అలాగే.. పరిశ్రమలతోనే ఉపాధి కల్పన సాధ్యమన్నారు. ఇథనాల్‌ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలని నితిన్‌ గడ్కరీ ఆకాంక్షించారు.  దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అవుతుందని తెలిపారు. త‍్వరలో డీజిల్‌ లారీలకు బదులుగా ఎలక్ట‍్రిక్‌ లారీలు, డీజిల్‌ స్థానంలో సిఎన్‌జీ, ఎల్‌పిజి రవాణా వాహనాలు వస్తాయని సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం తగ్గి.. గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement