సాక్షి, హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. కరోనా విజృంభణతో పలు ఆలయాల్లో ఆలయ అధికారులు ఆంక్షలను కూడా విధించారు.
విశాఖ: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం అప్పన్న స్వామిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు దైవం శ్రీవరహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని అన్నారు.
వైఎస్ఆర్ జిల్లా: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై జగదభిరాముడు కొలువు దీరారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి సీతారామలక్ష్మణుల దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. గోవింద నామ స్మరణతో కోదండ రామాలయం మార్మోగుతోంది. భక్తుల సౌకర్యార్థం కోసం అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శన భాగ్యం చేసుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా:
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. గోవిందనామ స్మరణలతో శేషాచల కొండ మార్మోగుతోంది. సాధారణ భక్తులు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రూ.100, రూ.200, రూ.500 టిక్కెట్లపై ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా: నియోజకవర్గంలో ముక్కోటి ఏకాదశి మహా పర్వదినం సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భారీ క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పల్లెపాలెం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖ నగరంలో వైష్ణవ దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయం, పెందుర్తి వేంకటాద్రి దేవాలయం, శ్రీ భూ నీల సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయం, సింహాచలం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను విద్యుత్ దీపాలు, ప్రత్యేకమైన పూలతో సుందరంగా అలంకరించారు.. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారినుంచే నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకున్నారు.. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో దేవాలయంలోకి అనుమతికి మస్కును తప్పనిసరి చేశారు. క్యూలైన్లో ఎక్కడికక్కడ శానిటైజేషన్ చేస్తున్నారు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అప్పన్న స్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ప్రత్యేకమైన పుష్పాలతో అందంగా అలంకరించారు.. భక్తులు తెల్లవారు జాము నుంచే అప్పన్న స్వామి దర్శించుకునేందుకు సింహాచలం కొండ పైకి చేరుకున్నారు.. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తర ద్వారం ద్వార స్వామివారిని దర్శించుకున్నారు.. కరోనా బారినుండి ప్రజలందరిని రక్షించాలని అప్పన్న స్వామి కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment