కోటంరెడ్డి.. ఆనంరెడ్డి.. ఏ రెడ్డి వెళ్లినా.. ప్రజారెడ్లు జగన్ వెంటే.. | Venkateshwar Peddireddy Analysis of Nellore Reddys Politics | Sakshi
Sakshi News home page

కోటంరెడ్డి.. ఆనంరెడ్డి.. ఏ రెడ్డి వెళ్లినా.. ప్రజారెడ్లు జగన్ వెంటే..

Published Tue, Feb 7 2023 8:55 AM | Last Updated on Tue, Feb 7 2023 9:12 AM

Venkateshwar Peddireddy Analysis of Nellore Reddys Politics - Sakshi

శివరాత్రి వచ్చేస్తుంది. అప్పుడే ఎండలు మండిపొతున్నాయి. శివరాత్రి వెళ్లాక చలి కూడా శివ..శివ అంటూ వెళ్లిపోతుందట..!!. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కూడా మండే ఎండలతో పోటీ పడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంట రాజకీయ వేడి గాలులు వీస్తున్నాయి. ఆ వేడి గాలులతో ఏర్పడిన  బంగాళాఖాతంలో ఏర్పడిన రాజకీయ అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారి నెల్లూరు జిల్లాలో తీరం దాటింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే 'కోటంరెడ్డి' తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాలని ప్రయత్నించింది. 'కోటంరెడ్డి'తుఫాన్ వెంట వచ్చిన 'ఆనంరెడ్డి' తుఫాన్ తీరాన్ని టచ్‌ చేసి తుస్ మంటే.. 'కోటంరెడ్డి' తుఫాన్ మాత్రం 'ఎల్లో గాలుల' సహయంతో  విధ్వంసాన్ని సృష్టించాలని చూసింది. కానీ.. రాజకీయ వాతావరణవేత్తలు అంచనాలను, ఎల్లో వ్యూహకర్తల అంచనాలను 'కోటంరెడ్డి' నెరవేర్చలేకపోయారు. నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు 'కోటంరెడ్డి' తుపాన్‌ సృష్టిస్తుందని చంద్రబాబు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి.

గత కొన్ని నెలలుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు, లోకేష్.. అలానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో టచ్‌లో ఉన్నారని వైఎస్ఆర్‌ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ ఆరోపణ కాదు నిజం కావొచ్చు. ఎందుకంటే..అమరావతి పాదయాత్రికులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపర్యలు చేశారు. భోజనం పెట్టారు, మంచినీళ్లు ఇచ్చారు. ఇదంతా చేసింది మానవతాదృక్పథంతో అనుకోవడానికి వీళ్లేదు. దీనిలో రాజకీయ వ్యూహం, కోణం ఉన్నాయి. తన పార్టీ ఫిరాయింపుకు కోటంరెడ్డి ఆ రోజు నుంచే పునాదులు వేసుకుంటున్నాడు. కోటంరెడ్డి ప్రతి అడుగు  సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వేశాడు.  'జగనన్న మాట గడప గడపకూ కోటంరెడ్డి బాట' పేరుతో కోటంరెడ్డి పాదయాత్ర చేసినా ఆ పాదయాత్ర తన రాజకీయ స్వార్ధంతో చేసిందే. తన పరపతి పెంచుకోవడానికి చేసిందే తప్పితే పార్టీ, ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ కోసం చేసింది కాదు.

వైఎస్ఆర్ సీపీ స్థాపించక ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్త. అటువంటి కోటంరెడ్డి ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్‌ఆర్ సీపీ నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకుని రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మొదటి సారి టికెట్ తెచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో నెల్లూరులో అందరికీ తెలుసు.. రెండోసారి టికెట్ ఇవ్వొద్దని నెల్లూరు రూరల్ నుంచే ఎన్నో వినతలు కానీ.. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చి గెలిపించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మొదటి నుంచి ఆ జిల్లా నేతలు, కార్యకర్తలకు అనుమానమే కానీ..సీఎం వైఎస్ జగన్ తన మనిషిగానే కోటంరెడ్డిని చూశారు. 'శ్రీధరన్న' అని ఆప్యాంగా పిలిచేవారు. ఆ మంచి మనసుకు , ఆ మంచి మాటకు కోటంరెడ్డి వెన్నుపోటు పొడిచాడు.

రాజకీయాల్లో "హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి'. వైఎస్‌ఆర్‌ సీపీని వదిలేసి టీడీపీలోకి వెళ్లాలనే కోటంరెడ్డి నిర్ణయం 'రాజకీయ ఆత్మహత్య'. దీనిలో సందేహం లేదు. వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నాడు. నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఏమైందీ...ఆ 23 మంది, ముగ్గురు ఎంపీలు ఎక్కడున్నారు..? కోటంరెడ్డి ఆలోచన చేసుకోవాలి. పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. నడిపించే నాయకుడు ముఖ్యం. కోటంరెడ్డిలో పదవి కాంక్ష ఎంతగా పెరిగిపోయిందంటే చంద్రబాబును చీకట్లో కలిసే అంతగా పెరిగిపోయింది. కోటంరెడ్డికి పదవిపై ప్రేమ ఎంతగా పెరిగిందంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో డిన్నర్ చేసే అంతగా..!!. జగనన్నను ఎంతగానో అభిమానిస్తానని చెప్పుకునే కోటంరెడ్డి.. చంద్రబాబును ఎందుకు కలిశాడు..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో కలిసి ఎందుకు డిన్నర్ చేశాడు..? 

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పినట్లు 'కోటంరెడ్డి ఫోన్ కాల్ ట్యాప్ చేయలేదు.. చంద్రబాబు ట్రాప్‌లో కోటంరెడ్డి పడ్డారు". కాకాణి మాటలు అక్షర సత్యం. " పార్టీ లేదు బొక్కా లేదు" అని అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. "రోజు రోజుకు పార్టీ నిర్వీర్యమైపోతుందని"
చంద్రబాబు స్వయంగా అన్నారు. కుప్పంలో తన పరిస్థితి బాగోలేక పక్క జిల్లాల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందో అని చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. కుప్పంలో కూర్చొని పక్క చూపులు చూస్తున్నారు. లోకేష్‌కు మంగళగిరిలో పోటీ చేసే ధైర్యం లేదు. హిందూపూర్‌లో బాలయ్య ఓడిపోతాడనే టాక్ గట్టిగా వినిబడుతోంది. నా దృష్టిలో టీడీపీ సోషల్ మీడియాలోనే బతుకుతుంది. క్షేత్రస్థాయిలో టీడీపీ పాడె మీద ఉంది. పాడె మీద ఉన్న టీడీపీలోకి పోయి కోటంరెడ్డి ఏం సాధించాలని..?!!. 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. ఏ రెడ్డి అయినా పదవి కాంక్షతో కాకుండా వాస్తవ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. చంద్రబాబు కౌగిలి విష కౌగిలి, దృతరాష్ట్ర కౌగిలి అని కోటంరెడ్డి, ఆనంరెడ్డి గ్రహించాలి. మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటాడు..తరువాత కరివేపాకులా పడేస్తాడు. ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన బాబుకు కోటంరెడ్డి, ఆనంరెడ్డి ఓ లెక్కా..?. 

నెల్లూరు జిల్లాలో కావాలనే అసంతృప్తిగా ఉన్న రెడ్లను టార్గెట్ చేశాడు చంద్రబాబు. అనుకున్నదే తడువుగా రాధాకృష్ణను రంగంలోకి దింపాడు. కోటంరెడ్డి గాలం వేశారు. ఆనంను కదిలించారు. ఎందుకు..? నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ కంచు కోట. 2019లో  నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ సీటు వైఎస్ఆర్‌ సీపీ గెల్చుకుంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ తుఫాన్ అలజడి అటు రాయలసీమ రెడ్లలోనూ..ఇటూ ప్రకాశం, పల్నాడు రెడ్లలోనూ ఉంటుంది అనేది చంద్రబాబు అంచనా. కానీ..కోటంరెడ్డి వెనుక కార్పొరేటర్ కూడా పోవడానికి సిద్దంగా లేడు. ఇదీ కోటంరెడ్డి బలం.

సోనియాతో కలిసి చంద్రబాబు, ఎల్లో మీడియా వైఎస్ఆర్ కుటుంబాన్ని, జగనన్నను ఎంత  ఇబ్బంది పెట్టారో గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు, ఎల్లో మీడియా రెడ్లకు సహజ శత్రువులు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం, ఎల్లో మీడియా ఉన్నంత కాలం ఆ శత్రత్వం కొనసాగుతూనే ఉంటుంది. పదేళ్లు ప్రాణాలు ఫణంగా పెట్టి జగనన్న జెండా ఎగిరేలా కష్టపడ్డాం. జగనన్నను సీఎం సీటు మీద చూసుకున్నాం. మన అంచనాలకు మించి జగనన్న పరిపాలన చేస్తున్నారు. దేశమే కాదు, ప్రపంచమే ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా చేస్తున్నారు. ఎల్లో రాక్షసులతో మహా యుద్ధమే చేస్తున్నారు. ఆ మహా యుద్ధంలో జగనన్నకు మనమంతా తోడుగా ఉండాలి. అండగా నిలబడాలి. జగనన్న చేతిలో మనమే ఆయుధాలమై ఎల్లో రాక్షసుల నీచ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. అంతేకాని..పదవుల కోసం జగనన్నను వదిలేసి వెళ్లకూడదు.

10 ఏళ్లు కష్టపడ్డాం..జగనన్న మాకేం చేయలేదనే రెడ్లు ఒక్కటీ ఆలోచించాలి. జగనన్న ఆలోచనను అర్థం చేసుకోవాలి. జగనన్న కళ్లతో భవిష్యత్తును సందర్శించాలి. గాంధీ జీ, అంబేద్కర్ కలల సాధకుడు  సీఎం వైఎస్ జగన్. పదవుల కోసం ఆశపడే వారే జగన్‌ను విడిచి వెళ్తారు.. చరిత్రలో నిలిచి, చరిత్ర సృష్టించాలి అనుకునేవారు వైఎస్ జగన్‌తో ఉంటారు.. మళ్లీ ఆయనను సీఎం చేసుకుంటారు. అంటే..ప్రజారెడ్లు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే ఉంటారు. 'కోటంరెడ్డి' తుఫాన్‌లు ఎన్ని వచ్చినా తీరం కూడా దాటనీయకుండా అడ్డంగా అడ్డుపడతారు. భవిష్యత్తు దివిటీలై వెలుగుతారు.

::: వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ.. సామాజిక విశ్లేషకులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement