సాక్షి, అమరావతి/ఆనందపురం(విశాఖ): ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన సేవలందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ‘రైతు భరోసా కేంద్రాలు’ వంటి వ్యవస్థ మాకు తెలిసి ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదో విప్లవాత్మక ఆలోచన.. ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని రైతులు చెబుతున్నారు’’ అని వియాత్నం ప్రావిన్షియల్ నేషనల్ అసెంబ్లీ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఇండో–వియత్నాం పార్టనర్‌షిప్‌లో భాగంగా వియత్నాంకు చెందిన ప్రొవిన్షియల్ పార్టీ కమిటీస్ చైర్మన్ వోడిన్ టిన్, జియాన్‌జియా సిటీ పీపుల్స్ కౌన్సిల్ చైర్మన్ వో ఫామ్ ఎక్స్‌వాన్ లామ్, ప్రొవిన్షియల్ పీపుల్స్ కమిటీ వైస్ చైర్మన్ లిట్రాంగ్‌యెన్ తదితరులతో కూడిన 14మంది సభ్యుల అత్యున్నత స్థాయి బృందం మూడురోజుల పర్యటనకు భారతదేశానికి విచ్చేసింది.
దేశంలోని వివిధ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అమలు తీరుపై అధ్యయనం చేసేందుకు విచ్చేసిన ఈ బృందం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఏపీలో వివిధ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పుల పరిశీలన కోసం రాష్ట్రానికి వచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం చేసింది. తొలుత వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, శ్రీధర్ తమ శాఖల్లో గడచిన నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలపై వియాత్నం బృందానికి వివరించారు.
అనంతరం క్షేత్ర స్థాయి సందర్శనలో భాగంగా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వేములవలస గ్రామంలోని ఆర్బీకేను సందర్శించారు. ఆర్బీకే సేవలతో కూడిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కాగా, ఇప్పటికే ఇథియోఫియా దేశం ఏపీలో పర్యటించి ఆర్బీకే సాంకేతికతతో పాటు ఇతర కార్యక్రమాలను తమ దేశంలో అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందని కమిషనర్ హరికిరణ్ వివరించారు. వ్యవసాయ ప్రాధాన్యతా దేశాల్లో ఇదే రీతిలో డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయని ఆకాంక్షిస్తూ ఆర్బీకే విజిటర్స్ బుక్‌లో బృందం తమ అభిప్రాయాన్ని రాశారు. వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్లర్లు, జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మన్మధరావు, పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుడు కరుణాకర్, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్బీకే వ్యవస్థ అద్భుతం
ఏపీలో విద్య, వైద్య, వ్యవసాయ ఇతర రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. మీ కేంద్ర ప్రభుత్వం చూసి రమ్మంటే ఇక్కడకు వచ్చాం. నిజంగానే ఇక్కడ ప్రభుత్వం దూరదృష్టి చాలా బాగుంది. డిజిటల్ టెక్నాలజీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారు. వ్యవసాయంపై ఆధారపడిన దేశాలు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.– లిట్రాంగ్‌యెన్, వైస్ చైర్మన్ వియాత్నం ప్రొవిన్షియల్ అసెంబ్లీ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment