
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు అతిక్రమించడంతో పాటు అవకతవకలకు ప్పాలడిన విశాఖపట్నంలోని గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చి (జీఐఎంఎస్‌ఆర్)పై చర్యలు తీసుకోవాలని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సంస్థ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ఎన్‌ఎంసీ చైర్మన్ సురేశ్‌చంద్ర శర్మకు సోమవారం లేఖ రాశారు. ‘ఎన్‌ఎంసీ, పూర్వ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు అతిక్రమిస్తూ జీఐఎంఎస్‌ఆర్ పనిచేస్తోంది. నకిలీ, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో గుర్తింపు పొందినట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి.
ధ్రువపత్రాలు సరైనవా కాదా అని అనుమతి ఇచ్చేముందు నాటి ఎంసీఐ తనిఖీ చేసిందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో ఆ సంస్థ ఉంది. 40 ఎకరాల 51 సెంట్ల ప్రభుత్వ భూమిని గీతం ఆక్రమించిందని ఆర్డీవో తన నివేదికలో పేర్కొన్నారు. జీఐఎంఎస్‌ఆర్‌కు ఎస్సెన్షియాలిటీ సర్టిఫికెట్ రద్దు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించాలి. ఎన్‌ఎంసీ తనిఖీలు నిర్వహించి జీఐఎంఎస్‌ఆర్‌కు అనుమతి రద్దు చేయాలి.’ అని విజయసాయిరెడ్డి ఎన్‌ఎంసీకి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment