సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత శరవేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఎంపిక చేసిన గ్రోత్ హబ్‌లో విశాఖ స్థానం దక్కించుకుంది. దేశం మొత్తం మీద నాలుగు నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో విశాఖ ఒకటి కావడం విశేషం. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరంగా విశాఖ మరో ప్రత్యేకతను నమోదు చేసింది.
విశాఖ కాకుండా ముంబై, సూరత్, వారణాసి కూడా ఎంపికయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖ నగరాభివృద్ధికి ఉన్న అవకాశాలపై నీతి ఆయోగ్ ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఈ క్రమంలో ఆయా రంగాల అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు ఇచ్చే విధంగా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది.
విశాఖ అభివృద్ధికి విస్తృత అవకాశాలు..
విశాఖ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం, రహదారుల అనుసంధానం ఇలా మూడు ఉండటంతో పాటు తూర్పు నావికాదళానికి ప్రధాన కేంద్రంగా ఇప్పటికే నగరం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్రంగా భాసిల్లుతోంది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ మొదటగా ఈ ప్రాంతానికి సంబంధించి వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలు, అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలను అధ్యయనం చేయనుందని తెలుస్తోంది.
నాలుగు కీలక అంశాలపై..
విశాఖ నగరాభివృద్ధిపై ఎస్‌వీవోటీ అనాలసిస్ అంటే... స్ట్రెంత్ (బలం), వీక్‌నెస్ (బలహీనతలు), ఆపర్చునిటీస్ (అవకాశాలు), త్రెట్స్ (ఇబ్బందులు).. ఈ నాలుగు అంశాలపై నీతి ఆయోగ్ బృందం అధ్యయనం చేయనుంది. ఇందుకనుగుణంగా ఆ ర్థిక వృద్ధికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని.. వీటిని సాధించేందుకు ఒక పాలసీని రూపొందించనుందని సమాచారం. విశాఖ నగరంలో ప్రధానంగా ఎగుమతి ఆధారిత పరిశ్రమలతోపాటు ఫార్మా, ఆటో, పెట్రోకెమికల్స్, టెక్స్‌టైల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి.
ఈ రంగాలతో పాటు ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలకు కూడా నగరం మంచి ఎంపిక అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ బృందం నిర్ణయాలను అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి కమిటీలో జీవీఎంసీ కమిషనర్‌లు కీలకంగా వ్యవహరించనున్నారు.
ప్రత్యేక రాయితీలకు అవకాశం..
వాస్తవానికి నీతి ఆయోగ్ బృందం ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. ఇప్పటికే ఒక దఫా విశాఖలో పర్యటించింది. ప్రధానంగా విశాఖ నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో పాటు చేపడుతున్న పలు పనులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పలు పరిశ్రమలతో పాటు నగర భౌగోళిక విస్తీర్ణం, అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసినట్టు సమాచారం.
గ్రోత్ హబ్‌లో ప్రధానంగా నగరంలో ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాల అభివృద్ధికి అవకాశం ఉందో.. అందుకనుగుణంగా ఆయా రంగాలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే విశాఖ అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్ సిద్ధమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాయితీలు మంజూరు చేస్తే నగరంలో అన్ని రంగాలు ఇతోధికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment