
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయి. తొలి నెల మినహా తరువాత నెలల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వడం లేదు. గత నెల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 10వ తేదీ వచ్చే వరకు జీతాలను చెల్లించలేదు. ఈ నెల కూడా అలాగే చేస్తారనే భయం ఉద్యోగులను వెంటాడుతోంది.
రాష్ట్ర సచివాలయంతోపాటు శాఖాధిపతులు కార్యాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు వారి ఖాతాల్లో పడలేదు. ఈఎంఐలు చెల్లించాల్సిన ఉద్యోగులు జీతాల మెసేజ్ కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల ఫాఠశాల్లో పనిచేసే ఉద్యోగులు, గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలివ్వడం లేదు. మంగళవారం కూటమి ప్రభుత్వం మరో రూ.4,237 కోట్ల అప్పు చేస్తోంది. ఆ నిధులు ఖజానాకు చేరిన తరువాతనైనా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారా.. అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment