సాక్షి, విశాఖపట్నం :
ఏంటీ మిషన్. వాటర్ ప్యూరిఫయరా..?
యస్.. ఇది స్వచ్ఛమైన నీటిని అందించే మిషన్..
అరె.. దీనిలో నీరు నింపేందుకు పైప్ కనెక్ట్ చెయ్యలేదెందుకు.?
అవన్నీ మీకెందుకు..? మీకు కావాల్సింది నీరే కదా..
అవును తాగాలని ఉంది. కానీ...!!!!
నీ సందేహంతో పాటు.. దాహం కూడా తీరుతుందిలే. ఆ గ్లాస్ పట్టుకొని.. ట్యాప్ కింద పెట్టి చూడు..
అరే.. నీరు వస్తుంది.. ఇదెలా సాధ్యం..?
అదే మ్యాజిక్కు.. మాయా లేదు.. మంత్రం లేదు.. నీటిపైపూ లేదు.. శ్రమా లేదు.. నేను గానీ.. గ్లాస్ పట్టానంటే.. ఈ ప్యూరిఫయర్ నుంచి నీరు రావాల్సిందే...
బాబూ... ఆ ట్రిక్ ఏంటో చెప్పు..!!!
చెప్తా.. ఈ ప్యూరిఫయర్‌కు నీటి పైప్ అవసరం లేదు. కేవలం గాలిలో ఉన్న తేమను ఆక్సిజన్‌ని తీసుకొని.. నీటిగా మార్చేసుకుంటుంది. మనకు ఎంచక్కా అందించేస్తుంది.
అవునా.. నిజమా..!!
నిజం. ఇది కొత్త టెక్నాలజీ.. నీటి ఎద్దడి లేకుండా.. రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యం అనే కాన్సెప్‌్టతో అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ దుర్గాదాస్ ఆవిష్కరణ. ఈమె ఒకప్పటి భారత క్రికెట్ క్రీడాకారిణి కూడా. అమెరికా వెళ్లిపోయిన తర్వాత.. యూఎస్ మహిళా టీమ్‌కు కెపె్టన్‌గా కూడా వ్యవహరించారు. ఆమె ఆలోచనల నుంచి పుట్టిందే ఏరోనీరో.
మరి.. గాల్లో ఎన్నో రకాల విషవాయువులు కూడా ఉంటాయి కదా.. మరి అందులోంచి తయారైన నీటిలో ఆ విషం ఉండదా.?
అదేం ఉండదు. ఇందులో నాలుగు అంచెల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో గాలిలోని తేమను పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్‌గా మారుస్తుంది. తొలుత ఎయిర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. దీని ద్వారా గాల్లో మలినాలు తొలగిపోతాయి. అక్కడి నుంచి కార్బన్ ప్యూరిఫికేషన్ ద్వారా అసహ్యకరమైన రుచి, వాసన, రంగు తొలగిపోతాయి. అప్పుడు నీటిగా మారుతుంది.
ఆ నీటిని యూవీ ప్యూరిఫికేషన్ చేసి బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. అప్పుడు మినరల్స్ మిళితమవుతాయి. దీని ద్వారా పీహెచ్ లెవల్స్ 7 నుంచి 8.5 పీహెచ్‌గా ఉంటాయి. అంటే.. పూర్తి ఆల్కలిన్ వాటర్‌గా గాలిలో తేమ మారి.. స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది.
భలేభలే.. మరి రోజుకు ఎన్ని లీటర్లు ఇస్తుందీ ఏరోనీరో..?
ఇందులో భిన్నమైన రకాలున్నాయంట. 10 నుంచి 25 లీటర్ల వరకూ ఇంట్లో వినియోగించే ప్యూరిఫయర్లున్నాయి. ఇప్పటి వరకూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడుతున్నారు. ఈ ప్యూరిఫయర్ల అమ్మకాల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1,71,50,920 లీటర్ల నీటిని తయారు చేశారంట. అంతేకాదు.. 6,86,03,680 లీటర్ల నీటిని ఆదా చేశారంట. సంస్థ వినూత్న ఆలోచన, నీటిని ఆదా చేస్తున్న విధానాన్ని మెచ్చి.. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా పొందారు.
అద్భుతం కదా.. మరి మీకెక్కడ తారసపడిందీ స్పెషల్ ప్యూరిఫయర్..?
ఓ.. అదా.. నగరంలో డీప్‌టెక్ కాంక్లేవ్ జరుగుతోంది కదా.. అక్కడ టెక్ ఎక్స్‌పోలో సంస్థ ప్రతినిధులు దీన్ని ప్రదర్శనకు ఉంచారు. చూస్తే.. అద్భుతమనిపించింది. మేం మాత్రమే తెలుసుకుంటే సరిపోదు కదా.. అందుకే.. ‘సాక్షి’ పాఠకులకీ అందిస్తున్నాం. ఇప్పుడు సరదాగా ఈ ప్యూరిఫయర్‌ను చూసి.. గాల్లో నీరు పుడుతుందే.. తాగితే మస్తుగుంటుందే.. అని పాడుకుందామా....!!
Comments
Please login to add a commentAdd a comment