
సాక్షి, అమరావతి/పెనమలూరు: ఏపీలోని రైతు భరోసా కేంద్రాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని, ఎక్కడకు వెళ్లినా వీటిపైనే చర్చ జరుగుతోందని కేరళ రాష్ట్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ మంత్రి చించురాణి తెలిపారు. వీటిని ఆదర్శంగా తీసుకుని కేరళలోనూ ఆర్బీకే తరహా సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తేవాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా వణుకూరు ఆర్బీకే కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
కియోస్క్ ద్వారా సంపూర్ణ మిశ్రమ దాణా, పశుగ్రాస విత్తనాలను రైతులు ఏ విధంగా పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. అలాగే డాక్టర్ వైఎస్సార్ సంచార పశువైద్య సేవ వాహనాలు, వాటి సేవలనూ పరిశీలించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో సంచార పశు వైద్య వాహనాలను ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. అనంతరం పెదపారుపూడి మండలం ఎలమర్రులోని పుంగనూరు గో జాతి పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. జాయింట్ లయబిలిటీ గ్రూపు సభ్యులతో సంభాషించారు. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఆర్బీకేలను వన్ స్టాప్ సొల్యూషన్స్ సెంటర్స్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దిందని చెప్పారు. ప్రతి ఆర్బీకేను రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దారని, గ్రామ స్థాయిలో పశుసంవర్ధక సహాయకులను నియమించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment