నేటి నుంచి జిల్లా అంతటా వివాహాల సందడి
పురోహితులు, వివిధ కళాకారులకు డిమాండ్
రాజంపేట టౌన్ : మాఘమాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. మాఘమాసం ఆరంభం నుంచే ముహూర్తాలను మోసుకురావడంతో కల్యాణ వేదికలు ముస్తాబయ్యాయి. ఈ ఏడాది మాఘమాసం ఆరంభం రోజు నుంచే వివాహాల సందడి ప్రారంభం కానుంది. ఈనెల 31వ తేదీ జిల్లాలో అనేక జంటలు ఒక్కటి కానున్నాయి. అందువల్ల 30వ తేదీ వివాహ రిసెప్షన్‌లు ఉన్న కారణంగా జిల్లా అంతటా గురువారం నుంచే సందడి వాతావరణం నెలకొననుంది. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, నిశి్చతార్థాలు, అన్నప్రాసన, ఉపనయనం వంటి శుభకార్యాలకు అనేక మంది ప్రజలు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు.
కల్యాణ మండపాలకు డిమాండ్
గత రెండు, మూడు నెలలుగా వివాహాలు కుదిరిన జంటలకు తల్లిదండ్రులు మాఘమాసంలో వివాహాలను జరిపిస్తున్నారు. అందువల్ల అనేక మంది ముందుగానే కల్యాణ మండపాలను బుక్ చేసుకోవడంతో వాటికి డిమాండ్ నెలకొంది. కల్యాణ మండపాలు దొరకని వారు తమ ఇళ్లవద్ద, విశాలమైన ఖాళీ స్థలాల్లో వివాహాలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జోరుగా అనుబంధ వ్యాపారాలు
వివాహాలు, శుభకార్యాల సీజన్ ప్రారంభం కానుండటంతో వివిధ వ్యాపారాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా దుస్తులు, బంగారు, అలంకరణ వస్తువులు, శుభకార్యాలకు అవసరమయ్యే సామగ్రి, పూల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. శుభకార్యాలు ముగిశాక దగ్గరి బంధువులు కొద్ది రోజుల పాటు శుభకార్యాలు జరుపుకున్న వారి ఇంటిలో ఉండనున్నందున నిత్యావసర వస్తువుల వ్యాపారం కూడా ఊపందుకుంది.
అనేక మందికి ఉపాధి
వివాహాలు, శుభకార్యాలు ప్రారంభం కావడంతో ప్రధానంగా పురోహితులకు, డెకరేషన్, మంగళ, బ్యాండు వాయిద్య కళాకారులకు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ (ఆర్కే్రస్టా), క్యాటరింగ్, బ్యూటీపార్లర్ నిర్వాహకులకు, ట్రావెల్స్ ఏజెన్సీలకు మెండుగా డిమాండ్ ఏర్పడింది. అందువల్ల ఆయా వ్యాపార వర్గాల వారికి చేతినిండా పని లభించడంతో శుభకార్యాలు వారి ఉపాధికి దోహదపడుతున్నాయి.
స్టేటస్ కోసం.. తగ్గేదేలే
ప్రస్తుతం ధనవంతులు తమ పిల్లలకు జరిపే వివాహాలు వారి స్టేటస్‌కు సింబల్‌గా మారాయి. ఆర్థిక పరిపుష్టిగల వారు వివాహాల కోసం ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ప్రతిదీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. వివాహ సమయంలో డెకరేషన్, విందు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలాగే అత్యాధునిక కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీయించేందుకు కూడా లక్షల్లో ఖర్చు చేస్తున్నవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వివాహ విందులో పసందైన వంటలు ఉండేందుకు పేరెన్నికగన్న క్యాటరింగ్ సంస్థలతో అల్పాహారం, భోజనం ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది వివాహానికి వచ్చిన వారికి విలువైన గిఫ్ట్‌లు కూడా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment