కుటుంబ సభ్యులతో ఆరేటి కోటేశ్వరమ్మ
(పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి సాక్షి ప్రతినిధి మేడికొండ కోటిరెడ్డి) :
రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమాభివృద్ధి పథకాలు.. కార్యక్రమాల వల్ల పల్లెల్లోని లక్షలాది పేద కుటుంబాల్లో అభివృద్ధితో కూడిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మగౌరవంతో కూడిన ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఆయా కుటుంబాల పెద్దలు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు ప్లాస్టిక్ పట్టా కట్టుకొని ఉండే ఒక రేకుల షెడ్డులో భార్య, భర్త, పెళ్లీడుకొచ్చిన కొడుకుతో కలిసి జీవనం సాగించిన పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామానికి గార్లపాటి కెజియా.. అప్పటిదాకా పనులు చేసుకుంటూ సంపాదించుకున్న సొమ్ముకు ప్రభుత్వ సహకారం తోడు కావడంతో కుమారుడి పెళ్లికి ముందే మూడు గదులు, వరండాతో కూడిన పక్కా ఇంటిని నిర్మించుకోగలిగింది.
ఆమె ఇంటి పక్కన నివాసం ఉండే ఆరేటి కోటేశ్వరమ్మ కొడుక్కు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ ఉద్యోగమే వచ్చింది. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆ కుమారుడు మరణిస్తే, ఆ కుటుంబంలోనే మరొకరికి కారుణ్య నియామక కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. చేతికి అందివ చ్చి న కొడుకు దూరమైన ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకే ఆమె మూడో కుమారుడికి ప్రభుత్వ వలంటీరుగా అవకాశం దక్కింది. వీరి ఇళ్లకు పక్కనే ఉండే మరో మహిళకు వివాహమై 25 ఏళ్లు అయినా, చెవి దిద్దులు తప్ప మరే ఇతర బంగారు ఆభరణాలు కొనుక్కోలేకపోయానని బెంగపడేది.
ఇప్పుడామె ఈ నాలుగున్నరేళ్లలోనే దాదాపు రూ.2 లక్షలకు పైగా విలువైన కొత్త బంగారు ఆభరణాలు కొనుక్కొంది. ఈ ముగ్గురి ఇళ్ల చుట్టుపక్కలే నివాసం ఉండే మేఘన.. వలంటీర్‌గా పని చేస్తూ నెలనెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం పొందడంతో పాటు అంతకు ముందు చేసుకొనే అన్ని పనులను ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకుపోతోంది. వీళ్లంతా ఆ గ్రామంలోని ఒక స్వయం సహాయక పొదుపు సంఘం (యెహోవా) సభ్యులు.
ఆసరా ద్వారానే రూ.3.34 లక్షలు లబ్ధి
మొత్తం పది మంది సభ్యులు ఉండే ఈ పొదుపు సంఘం పేరిట 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రూ.3,33,440 బ్యాంకు అప్పు ఉండింది. అప్పటి ఎన్నికల్లో హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో చేసిన రుణ మాఫీ మొత్తం నేరుగా వారి చేతికే అందింది. సంఘ సభ్యులు కెజియా, కోటేశ్వరమ్మ, మేఘన.. ఇలా పది మంది ఒక్కొక్కరు ఒక్కో విడతకు రూ.8,336 చొప్పున.. నాలుగు విడతల్లో రూ.33,344 లబ్ధి పొందారు. ఈ సంఘం ఒకసారి రూ.7,50,000 బ్యాంకు రుణం పొందగా, ఒక్కొక్కరూ రూ.75 వేల చొప్పున రుణ లబ్ధి పొందారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రోత్సాహంతో ఈ రుణ మొత్తాన్ని సంఘ సభ్యులందరూ సకాలంలో కిస్తీ రూపంలో చెల్లించారు.
15 రోజుల కిత్రమే మరో విడత ఏకంగా రూ.15,00,000 పొందారు. తద్వారా ఒక్కొక్కరూ రూ.లక్షన్నర దాకా రుణ లబ్ధి పొందారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాదిరి కాకుండా పొదుపు సంఘాల రుణాలపై వడ్డీని సున్నా వడ్డీ పథకం కింద జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో వారికి మరింత ఊరట లభించింది. గతంలో ఈ సంఘంలోని సభ్యుల కుటుంబాలు తమ కుటుంబానికి ఏ ఆర్థిక అవసరం ఏర్పడినా రూ.100కు నెలకు రూ.2, రూ.3 వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకోనే పరిస్థితి ఉండింది. ఈ నాలుగేళ్లలో వీరు ఏకంగా రూ.22.50 లక్షల రుణం తమ పొదుపు సంఘం ద్వారా పొందడంతో వడ్డీ రూపంలోనే ఒక్కొక్కరూ రూ.25 వేలకు పైబడే అదనపు ప్రయోజనం పొందారు.
చేయూత, పింఛను, రైతు భరోసా, ఇతరత్రా లబ్ధి
ఈ పేద కుటుంబాలకు ప్రభుత్వ సాయం కేవలం వైఎస్సార్ ఆసరా పథకం ఒక్కటికే పరిమితం కాలేదు. చేయూత కింద ఏడాదికి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున అందుతోంది. గార్లపాటి కెజియాకూ, ఆరేటి కోటేశ్వరమ్మకు ఇప్పటికే మూడు విడతలు అందింది. త్వరలో నాలుగో విడత అందనుంది. కెజియా భర్త గార్లపాటి యోహన్‌కు గత 56 నెలల కాలంలో పెన్షన్ రూపంలో రూ.1,32,750.. ఆరేటి కోటేశ్వరమ్మ భర్త ఆరేటి తిరుమలరావుకు రూ.93,750 పెన్షన్‌గా అందింది. కొడుక్కు ఉద్యోగం వచ్చిన కారణంగా కొంత కాలం పింఛను నిలిపి వేసినా, అతను రోడ్డు ప్రమాదంలో మరణించడంలో ఆరేటి తిరుమలరావుకు పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది.
కోటేశ్వరమ్మ కుటుంబానికి కరోనా సమయంలో ప్రభుత్వ సాయంగా రూ.1000తో పాటు జగనన్న తోడు పథకంలో రెండు విడతల్లో రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణం అందింది. వీరికి రైతు భరోసా పథకం ద్వారా 2022, 2023లో రెండు విడతలుగా రూ.13,500 చొప్పున అందింది. వీరి చిన్న కుమారుడు సురేష్ 2019–20లో డిగ్రీ చివరి సంవత్సరానికి సంబంధించి విద్యా దీవెన పథకం ద్వారా సాయం అందింది. కెజియా కుటుంబానికి కరోనా సాయంగా ప్రభుత్వమిచ్చిన రూ. 1000తో పాటు ఇతర పథకాలన్నీ కలిపి దాదాపు రూ.రెండున్నర లక్షల మేర ప్రయోజనం కలిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా లబ్ధి
► వైఎస్సార్ ఆసరా పథకం సద్వి నియోగం చేసుకోవడం ద్వారా తమ జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులపై 78,189 మంది తమ జీవిత గాధలను వివరిస్తూ వీడియోలు చిత్రీకరించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులపై 76,423 మంది, వైఎస్సార్ పెన్షన్లతో వచ్చిన మార్పుపై 99,436 మంది.. మొత్తంగా 2,54,013 మంది తమ జీవిత గాధలను వీడియోల రూపంలో చిత్రీకరించారు.
► నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం గత చంద్రబాబు ప్రభుత్వ సమయంలో రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 11.77 శాతం పేదరికం ఉండగా, 2022–23 నాటికి అది 4.19
శాతానికి తగ్గింది.
► రాష్ట్రంలో 2020–21తో పోలిస్తే 2022–23 సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 19.79 లక్షల నుంచి 21.65 లక్షలకు పెరిగింది. రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కూడ రూ.47,518 చొప్పున పెరగడం గమనార్హం.
► ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా అందజేసే సాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా గత నాలుగేళ్ల కాలంలో ఏకంగా 18.37 లక్షల మంది ప్రతి నెలా స్థిర ఆదాయం పొందేలా శాశ్వత జీవనోపాధులు ఏర్పాటు చేసుకున్నట్టు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment