కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, ప్రధాన డ్యాం డిజైన్‌ను ఖరారు చేసే అవకాశం
ఈలోగా కాఫర్ డ్యాంల మధ్య నీటిని తోడేయాలని సీడబ్ల్యూసీ ఆదేశం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద వచ్చే నెల 6 నుంచి 10 వరకు వర్క్ షాప్ నిర్వహించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిద్ధమైంది. ఈలోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో సీపేజీ నీటిని పూర్తిగా తోడివేయాలని పోలవరం అధికారులను సీడబ్ల్యూసీ ఆదేశించింది. డయాఫ్రం వాల్ నిరి్మంచే ప్రాంతాన్ని సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తు వరకు ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ చేసి ప్లాట్‌ఫాంను సిద్ధం చేయాలని సూచించింది.
6వ తేదీన అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనుంది. ఐదు రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వర్క్ షాప్‌లో చర్చించి, నిర్ణయం తీసుకోనుంది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించే విధానంతోపాటు గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యాం డిజైన్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.
సీడబ్ల్యూసీ ఆదేశం మేరకు కాఫర్ డ్యాంల మధ్య నీటిని తోడే పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా ముమ్మరం చేసింది. గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై ప్రధాన డ్యాం ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకున్న ప్రదేశాన్ని మే నాటికే సముద్ర మట్టానికి 16 మీటర్ల ఎత్తుతో ఇసుకను నింపి, వైబ్రో కాంపాక్షన్ చేసే పనులు పూర్తి చేసింది. సీపేజీ నీటిని పూర్తిగా తోడేశాక అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని మరో మీటరు ఎత్తు పెంచడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే బెంటనైట్ మిశ్రమం, కాంక్రీట్‌ను వర్క్ షాప్‌లో పరీక్షల నిమిత్తం సిద్ధంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment