సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఒక వైపు కేసులు. మరోవైపు దుష్ప్రచారం. టాపిక్ డైవర్ట్ చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో, అబద్దాలు చెప్పడంలో, మోసాలు చేయడంలో, వ్యక్తిత్వ హననంలో చంద్రబాబు ఎంత ప్రసిద్దుడో అందరికీ తెలుసు. లక్ష్మీపార్వతితో మొదలుపెడితే నా వరకు. ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, విద్యుత్ మీద, రోడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, పరిశ్రమల మీద, పారిశ్రామికవేత్తల మీద.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూల మీద దుష్ప్రచారం. ఇవన్నీ గాక, తల్లీ చెల్లీ అంటే నా కుటుంబంపై ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నాడు.’’
‘‘చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. నీకు కుటుంబం ఉంది. మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ నీవు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయరు. నేను చంద్రబాబును ఒకటే అడుతున్నాను. నేను సీఎంగా ఉన్నప్పుడు, ఆయన విపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీస్‌లో తన పార్టీ అఫీషియల్ ప్రతినిధితో నన్ను ఏమని తిట్టించాడు.. బోస్‌డీకే అని. అది ధర్మమేనా?’’
‘‘ఇదే చంద్రబాబునాయుడు నా చెల్లెలు షర్మిల మీద, హైదరాబాద్, జూబిలీహిల్స్ రోడ్ నెం.36లో ఆయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ తన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి తప్పుడు వార్తలు రాయించలేదా? పోలీసుల దర్యాప్తులో అది తేలలేదా?’’
‘‘ఇంకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఆయనకు చెందిన ఐ–టీడీపీ సభ్యుడు ఉదయ్‌భూషణ్ అనే వాడు ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, దాని ద్వారా మా అమ్మను, మా చెల్లిని తిట్టించాడు. దీంతో వర్రా రవీందర్‌రెడ్డి కేసు పెడితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు ఉదయ్‌భూషణ్‌ను ఆధారాలతో సహా అరెస్టు కూడా చేశారు.’’
‘‘చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవ్వరిమీద అయినా సరే, వ్యక్తిత్వ హననం చేస్తాడు. ఆయనే మన సానుభూతిపరుడు ఎవరైనా ఉంటే, వారి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయిస్తాడు. వారితోనే మనల్ని తిట్టిస్తాడు. మనం తిట్టించామని బయట ప్రచారం చేస్తాడు.ఇటువంటి మనిషి ప్రపంచంలో అరుదుగా పుడతాడు.’’
ఏనాడైనా నీ తల్లిదండ్రులను పట్టించుకున్నావా?
‘‘నేను చంద్రబాబును సూటిగా ఒకటే అడుగుతున్నాను. నీ తల్లిదండ్రులెవరో రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపావా? మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. నీ తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు చూపించావా? వారితో కలిసి ఎప్పుడైనా ఉన్నావా?. రాజకీయంగా నీవు ఎదిగిన తర్వాత నీ ఇంటికి తీసుకొచ్చి రెండు పూటలు భోజనం పెట్టి, వారిని సంతోషంగా పంపించావా? వారిద్దరూ కాలం చేస్తే, కనీసం తలకొరివి అయినా పెట్టావా?’’
‘‘ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డి అయినా తింటాడు. ఏ అబద్ధం అయినా ఆడతాడు. మోసం చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.’’ అని అన్నారు..
రామ్ గోపాల్ వర్మపై
‘‘రామ్ గోపాల్ వర్మపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. సెన్సార్ బోర్డ్ అనుమతితోనే సినిమాలు రిలీజ్ చేశారు. వర్మకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఉంది. చంద్రబాబు ఎల్లో బ్యాచ్ ఏ సినిమాలైనా తీయొచ్చా?’’
‘‘న్యాయం కోసం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. దళితుడు మాజీ ఎంపీ, నందిగం సురేష్ మీద కేసులు మీద కేసులు పెట్టారు. నందిగం సురేష్ 70 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ప్రశ్నించిన దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్‌పై 8 కేసులు పెట్టారు. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వారిని అక్కడే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వీడియోలు తీసి పై వాళ్లకు పంపిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టి పీఎస్‌లకు మారుస్తున్నారు. అరెస్టైన వారు జడ్జీల దగ్గర దెబ్బలు చూపిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment