
సాక్షి, విజయవాడ: వరద బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఇప్పటిదాకా సహాయం అందించకపోవడంపై వైస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా.. బుధవారం సాయంత్రం ఓల్డ్ ఆర్‌ఆర్(రాజరాజేశ్వరిపేట) పేటకు వెళ్లిన ఆయన.. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

వైఎస్ జగన్: ఆహారం, మంచి నీళ్లు అందుతున్నాయా?.. అధికారులు ఎవరైనా వచ్చారా?
ఆర్‌ఆర్ పేట స్థానికులు: లేదు సర్.. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందలేదు. కనీసం ఇటుగా ఏ అధికారి రాలేదు కూడా!
బాధితులకు ఇప్పటిదాకా సహాయక చర్యలు అందకపోవడంపై చంద్రబాబు సర్కార్‌పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు . తమ ప్రభుత్వం ఉండి ఉంటే ఇలా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరఫున అవసరమైన సాయం అందిస్తామని మాటిచ్చారాయన.

మొన్న సింగ్ నగర్‌లోనూ ఆయన బాధితుల్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతంలో బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైంది చూస్తున్నాం. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం వైఎస్సార్‌సీపీ తరఫున వైఎస్ జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని.. అయినా నింద గత ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.