సాక్షి, అమరావతి : ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘వైఎస్సార్ పురస్కారాల’ను రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాదీ ప్రకటించింది. వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన 27 మంది వ్యక్తులు, సంస్థలను అవార్డులతో సత్కరించనుంది. వ్యవసాయం, కళలు–సంస్కృతి, తెలుగు భాషా–సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ వంటి విభాగాల్లో 23 వైఎస్సార్ జీవిత సాఫల్య, నాలుగు వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను అందించనుంది. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రభుత్వ సలహాదారు (కమ్యునికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ మీడియాకు ఈ అవార్డు గ్రహీతల వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత సంకల్పంతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సామాన్యుల్లోని అసామాన్యులను గుర్తించి ‘వైఎస్సార్’ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి వచి్చన ప్రతిపాదనలను ప్రత్యేక కమిటీ వివిధ దశల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో పారదర్శకంగా అవార్డులకు ఎంపిక చేసిందన్నారు. సమాజంపై తమదైన ముద్రవేసిన వారిని సముచితంగా గౌరవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో అవార్డులను ప్రకటిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 1న ఈ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
వైఎస్సార్ పురస్కార ఎంపికల కమిటీలో తనతోపాటు ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్ (జాతీయ మీడియా), సీఎం రాజకీయ కార్యదర్శి ముత్యాలరాజు, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉన్నారన్నారు. ఇక వైఎస్సార్ జీవిత సాఫల్యం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్ సాఫల్యం కింద రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేస్తామని జీవీడీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment