అనకాపల్లి జిల్లా పిసినికాడలో 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం వైఎస్ జగన్
26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ
నేటి నుంచి 14 రోజులపాటు పంపిణీ ఉత్సవాలు.. ఇప్పటికే 3 విడతలుగా రూ.56,250 చొప్పున అందజేత
‘మహిళ బాగుంటే.. కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే ప్రాంతం బాగుంటుంది. ప్రాంతం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది’ అని నమ్మిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటినుంచీ అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నారు.
లక్షలాది మంది మహిళలకు ఆర్థికంగా ఆసరా అందిస్తూ వ్యాపారాలు, చేతివృత్తులు, చిన్నపాటి పరిశ్రమల వైపు చేయిపట్టి నడిపిస్తున్నారు. ఈ మహాయజ్ఞంలో భాగంగా గురువారం వైఎస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నాలుగో విడత ఆర్థిక సాయం అందజేయనున్నారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు గురువారం నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేసింది.
నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుంది. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్టవుతుంది.
14 రోజులపాటు ఉత్సవంలా..
ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యే నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాలు చేపడతారు.
వ్యాపార దిగ్గజాల ద్వారా అదనపు తోడ్పాటు
♦ వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలు ఆ మొత్తాలను వారివారి ఇష్టం మేరకు వినియోగించుకునే
వెసులుబాటు కల్పించారు.
♦ లబ్దిదారుల్లో ఎవరైనా ప్రభుత్వం అందజేసే సాయంతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసేందుకు ముందుకొస్తే వారికి అదనపు తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం గతంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంది.
♦ మూడు విడతల్లో లబ్ధి పొందిన మహిళల్లో ఇప్పటివరకు 16,55,591 మంది వివిధ రకాల వ్యాపారాలు ప్రారంభించి ప్రతి నెలా స్ధిర ఆదాయం పొందుతున్నారు.
♦ ఈ ఏడాది కొత్తగా జీవనోపాధులు ఏర్పాటుకు ముందుకొచ్చే లబ్దిదారులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా లేదంటే స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద ఇప్పించేందుకు మండల అధికారులు తగిన చర్యలు చేపడతారు.
♦ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఇప్పటికే వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి విజయగాధలను ఇతర లబ్దిదారులకు తెలియజేసేలా కార్యక్రమాలను, ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు.
నేడు సీఎం జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోట చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ చేరుకుని.. ‘వైఎస్సార్ చేయూత’ 4వ విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు.
Comments
Please login to add a commentAdd a comment