
పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
నెల్లూరు(వేదాయపాళెం): ప్రతి మహిళ అమ్మ కావడాన్ని అదృష్టంగా భావిస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి తన కడుపులో బిడ్డను ఊహించుకుంటూ ఎన్నో కలలు కంటుంది. ఈ క్రమంలో అటు పేదరికం.. ఇటు మూఢనమ్మకాలతో పౌష్టికాహారానికి దూరమై రక్తహీనత బారిన పడి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా బలహీనంగా పుట్టే బిడ్డ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ దశలో ప్రభుత్వం ఇలాంటి సమస్యలను గుర్తించి గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి ఈ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలో 56 వేల మందికి లబ్ధి చేకూరనుంది.
జిల్లాలో 3774 అంగన్‌వాడీ కేంద్రాలు
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న 3774 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 56 వేల మంది గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్నారు. అయినా జిల్లాలో 31.78 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలకు ఇంట్లో ఉండే కొందరు పెద్దలు ఆహార నియమాలంటూ పౌష్టికాహారాన్ని దూరం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పేదరికంతో తీసుకోలేకపోతున్నారు. అధికారుల లెక్కల మేరకు సగటున ప్రతి వెయ్యి మంది మహిళల్లో 320 మంది రక్తహీనత బారిన పడ్డారని సమాచారం. ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారాన్ని అందించే బాలసంజీవని స్థానంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
గతంలో లోపభూయిష్టం
అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో బాలసంజీవని పథకాన్ని ప్రవేశపెట్టినా, పథకంలో సరఫరా చేసే సరుకుల ధరల విషయంలో భారీ అవకతవకలు జరిగాయి. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం అవకతవకలను సరిచేసి, అంతకన్నా తక్కువ ధరకే ఎక్కువ పౌష్టికాహారాన్ని అందించేలా ఆరు రకాల సరుకులను వచ్చే నెల నుంచి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఈ పథకం అమలుకు జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. నిర్దేశిత సరుకుల కొనుగోలు, రవాణాకు, సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఇచ్చేందుకు టెండర్లను పిలిచామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.
సంపూర్ణ పోషణ
ఇప్పటివరకు ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో 56 వేల మంది గర్భిణులు, బాలింతలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భిణులు, బాలింతలకు సరిపడా పౌష్టికాహార సరుకులను ప్రతి నెలా ఇంటింటికీ అందజేయనున్నారు. గతంలో రక్తహీనత కలిగిన పిల్లలు, ఎస్సీ, ఎస్టీ బాలింతలు, గర్భిణులకు మాత్రమే ఇచ్చేవారు. అయితే నూతనంగా ప్రవేశపెట్టిన పథకంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలకు ఈ సరుకులను ప్రభుత్వం పంపిణీ చేయనుందని ఐసీడీఎస్ అధికారులు చెప్తున్నారు. రోజూ 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనె, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డు, 125 గ్రాముల కూరగాయలను అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment