మహా సంకల్పానికి జన నీరాజనం | YSRCP Leaders and Activists Celebrates for Prajasankalpa Yatra | Sakshi
Sakshi News home page

మహా సంకల్పానికి జన నీరాజనం

Published Mon, Nov 7 2022 5:10 AM | Last Updated on Mon, Nov 7 2022 7:27 AM

YSRCP Leaders and Activists Celebrates for Prajasankalpa Yatra - Sakshi

తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో 2017 నవంబర్‌ 6న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆదివారం సంబరాలు నిర్వహించారు. ఊరూవాడా దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత కేక్‌లు కట్‌ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అప్పట్లో పాదయాత్ర చేపట్టడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ.. పాదయాత్రలో ప్రజల సమస్యలు, కష్టాలను దగ్గర నుంచి చూసి.. వాటిని పరిష్కరించడానికి ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం.. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నాలుగు నెలల్లోనే 98 శాతం హామీలను అమలు చేయడాన్ని చాటిచెబుతూ ప్రజాప్రతినిధులు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గృహ నిర్మాణ, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే వాసుబాబు, కార్యకర్తల సమన్వయకర్త పుత్తా ప్రతాపరెడ్డి, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ తదితరులు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. పాదయాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు పాల్గొన్న వారికి నూతన వస్త్రాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.  

పాదయాత్ర హామీలే ఎన్నికల మేనిఫెస్టోగా.. 
ఈ సందర్భంగా గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక 98 శాతం హామీలను అమలు చేశారన్నారు. పాదయాత్ర లక్ష్యాలను ప్రతి గడపకూ తీసుకెళ్లారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, వికేంద్రీకరణతో సుపరిపాలన అందిస్తుండటంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీఎం వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేక కుప్పకూలిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌తో కలసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో ప్రజలు నిర్మించిన వైఎస్సార్‌సీపీ కంచుకోటను బద్ధలు కొట్టలేరని స్పష్టం చేశారు. సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు నిరంకుశ పాలనను నిరసిస్తూ, ప్రజలకు నేనున్నానంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన 3,648 కిమీల పాదయాత్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చి సామాజిక మహావిప్లవాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారని కొనియాడారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిందని.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

ఊరూరా వేడుకలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టి ఐదేళ్లు గడచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాయి. ఆయా ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement