పరిషత్‌ ఎన్నికలు: పోలింగ్‌ ప్రశాంతం.. | ZPTC And MPTC Election Polling Was Peaceful In AP | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికలు: పోలింగ్‌ ప్రశాంతం..

Published Fri, Apr 9 2021 7:22 AM | Last Updated on Fri, Apr 9 2021 7:22 AM

ZPTC And MPTC Election Polling Was Peaceful In AP - Sakshi

గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల కేంద్రంలో బారులు తీరిన ఓటర్లకు థర్మల్‌ స్కానింగ్‌ చేస్తున్న వైద్య సిబ్బంది

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్‌ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. మొత్తం 27,751 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించగా 60.91 శాతం ఓటింగ్‌ నమోదైంది. గతంతో పోల్చితే ఓటింగ్‌ శాతం కాస్త తగ్గినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం, చివరి నిమిషం వరకు ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితి, కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇందుకు కారణమని తెలిపాయి.

స్థానిక సంస్థల ఎన్నికలంటేనే పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎక్కువ హడావుడి ఉంటుంది. గ్రామంలో ఓటు ఉండి.. వివిధ కారణాలతో పొరుగు ఊళ్లలో తాత్కాలికంగా నివాసం ఉండేవారు ఈ రెండు రోజుల్లోనే స్వగ్రామాలకు చేరతారు. ఇలాంటి ఓటర్లు దాదాపు 10 శాతం వరకు ఉంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆఖరి నిమిషం వరకు కొనసాగిన అనిశ్చితితో వారంతా స్వగ్రామాలకు చేరుకోలేకపోయారు. 

కొన్ని మండలాల్లో 81 శాతానికిపైనే ఓటింగ్‌..
గత వారం రోజులుగా పెరుగుతున్న కరోనా ఉధృతి పోలింగ్‌పై ప్రభావం చూపిందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరోనా కేసుల నమోదు తక్కువగా ఉన్న జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటే 15 శాతానికిపైనే ఎక్కువగా ఓటింగ్‌ శాతం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లోనే అత్యల్పంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో అత్యధికంగా ఓటింగ్‌ శాతం నమోదు కావడం గమనార్హం. గురువారం రాష్ట్రంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదైన పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 68.27 శాతం ఓటింగ్‌ నమోదైంది.

అతి తక్కువ కరోనా కేసులు నమోదైన రెండో జిల్లా విజయనగరం జిల్లాలో 67.13 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఆ జిల్లాలోని డెంకాడ మండలంలో 81.71 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మండలాల్లో 40 – 45 శాతం ఓట్లు మాత్రమే నమోదయినప్పటికీ.. విజయనగరం జిల్లాలో తక్కువ ఓటింగ్‌ శాతం నమోదైన సీతానగరం మండలంలో కూడా 56.84 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో చాలా మండలాల్లో 75 శాతానికి పైనే ఓటింగ్‌ శాతం నమోదైందని.. అదే సమయంలో కొన్ని మండలాల్లో అత్యల్ప ఓటింగ్‌ శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యల్ప శాతం
రాష్ట్రంలో 8 జిల్లాల్లో 60 శాతం పైబడే ఓటింగ్‌ నమోదు కాగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యల్పంగా 51.68, 53.52 పోలింగ్‌ శాతం నమోదైంది. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలతోపాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 60 శాతానికి పైబడి ఓటింగ్‌ నమోదైంది.

మూడు గ్రామాల్లో రీపోలింగ్‌..
కాగా, విజయనగరం, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు గ్రామాల్లో శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహణకు జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు అందాయి. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల్లో తప్పులు దొర్లాయి. దీంతో ఆ ఎంపీటీసీ స్థానం పరిధిలోని మూడు పోలింగ్‌ బూత్‌లలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు రీపోలింగ్‌ జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అనుమతి తెలిపింది.

నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం చౌట భీమవరంలో ఒక పోలింగ్‌ బూత్‌లో బీజేపీ తరఫున ఏజెంట్‌గా కూర్చున్న వ్యక్తి బ్యాలెట్‌ బాక్స్‌ను అపహరించి నీళ్ల తొట్టిలో వేయడంతో అక్కడ కూడా రీపోలింగ్‌ జరగనుంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక, సూరంపూడిలో కూడా ఒక బూత్‌లో శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహిస్తారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ..
గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సరళిని విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని పర్యవేక్షించారు. 
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ సరళిని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఎప్పటికప్పుడు పరిశీలించారు. వెబ్‌కాస్టింగ్‌ విధానంలో ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు.

జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు..
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలోని జె.ఆర్‌.పురం పోలింగ్‌స్టేషన్‌లో ఓటరు స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఎన్నికల అధికారులను కలెక్టర్‌ జె.నివాస్‌ సస్పెండ్‌ చేశారు. టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన ఇచ్చినా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కొత్తూరు మండలంలో మాతలలో ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో మాతల నుంచి టీడీపీ తరఫున ఆయన సతీమణి కలమట ఇందిర పోటీ చేశారు.

రామకుప్పం మండలంలో అత్యధిక జనాభా ఉన్న రామాపురం తండాలో కాకుండా ననియాల తండాలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి భరత్, రెస్కో చైర్మన్‌ సెంథిల్‌ ఆ గ్రామాలకు వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు పోలింగ్‌లో పాల్గొన్నారు. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలంలో మూడు పంచాయతీల వారు నాటు పడవలపై మత్స్యగెడ్డ దాటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుజనకోట పంచాయతీలోని 11 గ్రామాల గిరిజనులు గెడ్డ దాటి వచ్చి సుజనకోట పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి శంభునిపాళెం గ్రామస్తులు తమను ఎస్సీలుగా పరిగణించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు.

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో బ్యాలెట్‌ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్‌లో కొంత జాప్యం జరిగింది. 
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని ఎల్‌ఎన్‌డీపేట, పైడిపాక, మామిడిగొంది, దేవరగొంది గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎల్‌ఎన్‌డీపేటలో ఎస్టీలు లేకపోయినా ఎస్టీలకు కేటాయించారని, పైడిపాక పునరావాస కేంద్రంలోని గిరిజనేతరులను ఇటికిలకోట గిరిజన పంచాయతీలో కలిపారని, మామిడిగొంది, దేవరగొంది గ్రామాలను ఒకే పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్నికలను బహిష్కరించారు. ఇరగవరం మండలంలో రాపాక, సూరంపూడి ఎంపీటీసీ స్థానానికి బ్యాలెట్‌ పేపర్‌ మారిపోవడంతో ఎన్నిక నిలిపివేశారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల్లో జవాన్లు మృతి చెందడంతో ఏపీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 47.03 శాతం పోలింగ్‌ కేంద్రాలు ఉండటంతో పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరిషత్‌ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 27,751 పోలింగ్‌ కేంద్రాల్లో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక, 247 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్‌ను పూర్తి చేసి బ్యాలెట్‌ బాక్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాడేపల్లి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ ప్రక్రియపై నిఘా పెట్టి, వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు. అన్ని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో 3,530 మందితో నిరంతర వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించారు.

స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం: ఎస్‌ఈసీ నీలం సాహ్ని
కొన్ని స్వల్ప ఘటనలు మినహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60.91 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. గుంటూరు జిల్లాలో పోలింగ్‌ విధులకు హాజరైన ముత్తుపల్లి జెడ్పీ స్కూల్‌ ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అబ్జర్వర్లతోపాటు పోలింగ్‌ సిబ్బంది, పోలీసులు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు.
చదవండి:
వీడియో వైరల్‌: హైదరాబాద్‌కు రజనీకాంత్‌   
రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement