
అధికారుల పనితీరే ప్రభుత్వానికి ప్రామాణికం
రాయచోటి: రెవెన్యూ అధికారుల పనితీరే ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికమని, రెవెన్యూ, సర్వే శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ప్రైవేటు పంక్షన్ హాల్‌లో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, మండల సర్వేయర్లు, ఆర్‌ఎస్డీటీలు, వీఆర్‌ఏలతో రెవెన్యూ అంశాలపై డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పిజీఆర్‌ఎస్ ఫిర్యాదులు, రీ సర్వే ప్రగతి, మంజూరైన పొసెషన్ సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ పురోగతి, హౌస్ సైట్స్ రీవెరిఫికేషన్ పురోగతి, పెండింగ్‌లో ఉన్న భూమి అన్యాక్రాంతం, భూసేకరణ, కోర్టు కేసులు, నివాస యూనిట్ల ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిపై ఆక్రమణల క్రమబద్దీకరణ, అసైన్మెంట్ భూములు కేటాయింపు తదితర రెవెన్యూ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గుర్రంకొండ తహసీల్దార్ అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది పనితీరు రాష్ట్ర పనితీరుగా ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితులలో అన్యాక్రాంతం కాకూడదని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది చేపడుతున్న వివిధ కార్యక్రమాలలో రకరకాలుగా అనుమానాలు వస్తాయని, వాటన్నింటినీ ఈ సదస్సు ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 25, 26వ తేదీలలో నిర్వహించే మూడవ కలెక్టర్ల సదస్సులో అన్నమయ్య జిల్లాకు ఏడవ ర్యాంకు వచ్చిందన్నారు. జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం వలనే ఈ ర్యాంకు జిల్లా సాధించగల్గిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్వేశాఖ ఏడీ భరత్ కుమార్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
పనితీరును మెరుగుపరుచుకోవాలి
రాజంపేట: రెవెన్యూ అఽధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. అన్నమాచార్య యూనవర్సిటీ ఆడిటోరియంలో డివిజన్ స్ధాయి రెవిన్యూ వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రజల సమస్యలను పూర్తి స్ధాయిలో పరిష్కరించేందుకు బాధ్యతయుతంగా , జవాబుదారితనంతో పనిచేయాలన్నారు. రెవెన్యూ అంశాలపై పవర్ పాయంట్ ప్రెజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలలో తీసుకోవాల్సిన చర్యలపై సర్వేయర్లు , ఆర్‌ఎస్టీటీలు, వీఆర్‌వో, వీఆర్‌ఏలు వెల్లబుచ్చిన సందేహాలకు అనుమాన నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో రాజంపేట డివిజన్‌లో 7229 ఫిర్యాదులు అందగా ఇప్పటి వరకు 6982 సమస్యలు పరిష్కరించారన్నారు. కేవలం 247 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ రెవెన్యూ అంశాలలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను బాధ్యతయుతంగా పూర్తి చేయాలన్నారు. రాజంపేట సబ్‌కలెక్టర్ వైకోమానైదియాదేవి మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమన్నారు. వర్క్‌షాప్‌లో సర్వేశాఖ ఏడీ భరత్‌కుమార్, హౌసింగ్ అధికారులు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్