
కందిపప్పు.. కరువే !
సాక్షి రాయచోటి : కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరుకులకు కోత పడుతోంది. ప్రభుత్వం కుదిస్తుందో లేక కార్డుదారులకు నిత్యావసరాలు అవసరం లేదనుకున్నారో ఏమో తేలియదుగానీ నిత్యావసర సరుకుల విషయంలో మాత్రం వాత తప్పడం లేదు. వైఎస్సార్ సీపీ సర్కార్ హయాంలో ఎప్పుడూ సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి నాణ్యమైన సరుకులతోపాటు చక్కెర, కందిపప్పు, బియ్యం, జొన్నలు, రాగులు అందించే పరిస్థితి కనిపించేది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కందిప్పు ధర పెరగడంతోపాటు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సబ్సిడీపై అందించకుండా కోత పెడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 5,04,325 కార్డుదారులు ఉన్నారు. జిల్లాలో దాదాపు రెండు నెలలుగా కందిపప్పు కనిపించడం లేదు. అధికమొత్తంలో ధర పలుకుతున్నాయి. ఇలాంటి తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీపై అందించాల్సి ఉంది. అయితే ఫిబ్రవరితోపాటు మార్చి, ఏప్రిల్ నెలల్లో కందిపప్పు అందించలేదని చెబుతున్నారు. ఒకనెలకు సంబంధించి జిల్లాకు 495 మెట్రిక్ టన్నులకు పైగా అవసరం ఉంటుంది. సరుకు రవాణా కాకపోవడంతో వీటికి ప్రభుత్వం ఎసరు పెట్టింది.జిల్లాలోని కార్డుదారులకు పూర్తిగా నిలిపివేయగా, అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం కందిపప్పు అందించారు.
జిల్లాలో అంతంత మాత్రంగానే చక్కెర
జిల్లాలో చక్కెర కొంతమంది కార్డుదారులకు మాత్రమే అందింది. సబ్సిడీపై అందించే చక్కెరకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా పీలేరు నియోజకవర్గంలోని వాయల్పాడు ప్రాంతంలో డీలర్లు డీడీలు తీయకపోవడంతో చక్కెర అందలేదు. ఒక్క వాయల్పాడే కాకుండా మరికొన్నిచోట్ల కూడా చక్కెరకు సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రస్తుతం చిత్రమైన పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తోంది.
పూర్తి స్థాయిలో కనిపించని సరుకులు
మార్చి చివరిలో వచ్చిన ఉగాది, ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన శ్రీరామనవమి పండుగ సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో సరుకులు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ముస్లిం సోదరులకు సంబంధించి పండుగ నేపఽథ్యంలో రంజాన్ తోఫా అందిస్తామని పేర్కొన్నా అదిఅమలుకు నోచుకోలేదు. ఇలా ప్రతిసారి ఏదో ఒక కారణంతో పండుగ సందర్భంలోనూ సరుకులు అందించకపోవడంపై కార్డుదారులు పెదవి విరుస్తున్నారు.
పండుగ సందర్భలోనూ కనిపించని పూర్తి స్థాయి సరుకులు
కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రేషన్ సరుకుల్లో కోత