
చింతచెట్టు కోసిన ఐదుగురిపై కేసు నమోదు
మదనపల్లె : పొలంలోకి అక్రమంగా ప్రవేశించి, చింతచెట్టును కోసిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పట్టణంలోని దేవళంవీధికి చెందిన వెంకటరమణ భార్య జగదీశ్వరికి తన తల్లి రామలక్ష్మమ్మ పేరుపై సర్వేనెం.144, 145లో 25 సెంట్ల పొలం ఉమ్మడి ఆస్తిగా ఉంది. ఈనెల 6న రామారావు కాలనీకి చెందిన మాదిన భాస్కర్, అతని భార్య మాదిన శాంతమ్మలు అంకిశెట్టిపల్లె మార్గంలో ఉన్న జగదీశ్వరి పొలంలోకి అక్రమంగా వెళ్లి అందులో ఉన్న రూ.లక్ష విలువచేసే చింతచెట్టును కోసివేశారు. జగదీశ్వరి కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి ప్రశ్నిస్తే..ఈ పొలం మీది కాదని, ఇంకా ఎక్కువ మాట్లాడితే..మీపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని వారిని బెదిరించి దౌర్జన్యం చేశారు. దీంతో జగదీశ్వరి సోమవా రం సాయంత్రం తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమేరకు మాదిని భాస్కర్, అతడి భార్య శాంతమ్మ, చింతచెట్టు కోసేందుకు వచ్చిన మరో ముగ్గురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.