
గ్యాస్ సిలిండర్ ధర పెంచడం అమానుషం
రాయచోటి : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో గ్యాస్ ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలకు అదనపు భారమైందని అభిప్రాయపడ్డారు. ఉజ్వల్ యోజన కింద అందజేసిన సిలిండర్‌పై కూడా రూ. 50లు భారాన్ని మోపారన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు సిలిండర్ ధర పెంచడం భారంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రవేశపెట్టిన దీపం–2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు చాలా మందికి అందడం లేదన్నారు. తొలి విడత కింద ఇప్పటి వరకు ముఫ్పై, నలభై శాతం మందికి సిలిండర్ రాయితీ డబ్బులు వారి ఖాతాకు జమ కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మన రాష్ట్రంలోనే ధరలు ఎక్కువ : పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.22, కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.92, తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉందన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా డీజీల్, పెట్రోల్ ధరలు రూ.10 తగ్గి ఉండేలా చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల సమయంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్