
వాల్మీకిపురి.. రథోత్సవ సిరి!
కలికిరి (వాల్మీకిపురం) : వాల్మీకిపురం పట్టాభి రామాలయ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజు బుధవారం ఉదయం విశేష అలంకరణలతో తీర్చిన దేవదేవుడి రథాన్ని స్వర్ణాభరణ శోభితులైన సీతారామచంద్రులు అధిరోహించగా... రామదండు రామనామ స్మరణలతో కదలిరాగా.. దేవదేవుడి రథచక్రాలు ముందుకు కదిలాయి. అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా ఇసుక పడినా రాలనంతగా భక్తజనం రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరాగా పట్టాభిరాముడి రథోత్సవం రమణీయంగా సాగింది. రామనామ స్మరణలతో వాల్మీకిపురం పట్టణ వీధులు హోరెత్తాయి. తెల్లవారుజాము నుంచి సుప్రభాతసేవ, అభిషేకం, అర్చన, విశేష పూజలు జరిగాయి. నూతన వధూవరులైన శ్రీ సీతారాములను తిరుచ్చిలో అలంకరణలు చేసి రథారోహణం గావించారు. హాజరైన వందలాది భక్తజనం రథంపై మిరియాలు, పూలు, పండ్లు చల్లుతూ మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం దాకా సాగిన రథోత్సవం స్థానిక హరిమందిరం వద్ద సేదతీరగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాముడి రథం యథాస్థలికి చేరుకుంది. భోగోత్సవమూర్తులైన శ్రీసీతారామలక్ష్మణులను మోతగాళ్లు తమ భుజస్కంధాలపై ఎత్తుకుని పరుగుపరుగున పురవీధుల గుండా నిర్వహించిన ధూళి ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాత్రి స్నపన తిరుమంజనం, కై ంకర్యాలు, ఏకాంత సేవతో కార్యక్రమాలు ముగిశాయి. రథోత్సవం సందర్భంగా సీఐ ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ శ్రీవల్లి, టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ మునిబాల కుమార్, ఆలయ అధికారి కృష్ణమూర్తి, అర్చకులు కృష్ణప్రసాద్, కృష్ణమూర్తి, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా పట్టాభిరాముడి రథోత్సవం
రామనామ స్మరణతో మార్మోగిన వాల్మీకిపురం

వాల్మీకిపురి.. రథోత్సవ సిరి!

వాల్మీకిపురి.. రథోత్సవ సిరి!