
సీఐపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
రాజంపేట : రాజంపేట అర్బన్ సీఐ రాజాపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని ఓ కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ స్ధాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందే గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం వర్గీయులు కళ్యాణమండపం వద్దకు చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సమావేశంలో కేవలం 30 మందికి అనుమతి ఉందని, బందోబస్తు నిర్వహించడానికి వచ్చిన సీఐ రాజా తెలిపారు. ఇందులో పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలే అని సుగవాసి వర్గీయులకు వివరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు తమను సమావేశానికి రానివ్వకుండా చేస్తున్న కుట్ర అని భావించిన సుగవాసి వర్గీయులు వీరంగం సృష్టించారు. వాగ్వాదానికి దిగారు. సీఐ మాటలను ఖాతరు చేయలేదు. ఇక చేసేదిలేక సీఐ వెనుదిరిగి వెళ్లిపోయారు. సమావేశానికి మంత్రితో పాటు సీడాప్ చైర్మన్, జోనల్ 4 ఇన్‌చార్జి దీపక్‌రెడ్డి హాజరయ్యారు. కాగా మరోసారి రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.
మంత్రి సమావేశంలో సుగవాసి వర్గీయుల రగడ