
ఎం.రాచపల్లి.. చిన్నారుల మృతితో తల్లడిల్లి..
చిట్వేలి : మండల పరిధిలోని ఎం.రాచపల్లిలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చొక్కారాజు దేవాన్స్ (7) తండ్రి నరసింహారాజు, తల్లి చంద్రకళ. వీరికి ఇద్దరు కుమారులు కాగా దేవాన్స్ పెద్ద కుమారుడు. అలాగే చొక్కారాజు విజయ్ (7) తండ్రి శేఖర్ రాజు, తల్లి విజయలక్ష్మీ. వీరికి ముగ్గురు కుమారులు కాగా విజయ్ చిన్న కుమారుడు. అలాగే రెడ్డిచర్ల యశ్వంత్ (6) తండ్రి వెంకటేష్, తల్లి సుప్రజ. వీరికి ముగ్గురు కుమారులు కాగా యశ్వంత్ పెద్దకుమారుడు. విజయ్ తండ్రి శేఖర్ రాజు, యశ్వంత్ తండ్రి వెంకటేష్ ఇద్దరు జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి ఉన్నారు. సంఘటన జరగడంతో శనివారం స్వగ్రామం చేరుకొని కుమారుల మృతిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమై కుప్పకూలిపోయారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. మృతులు యశ్వంత్, విజయ్ చిట్వేలిలో ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతుండగా దేవాన్స్ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతునాడు. వీరి మృతితో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.