
హత్యకేసులో పోలీసుల నిర్లక్ష్యం
మదనపల్లె : ఆటోలో ఎక్కిన వృద్ధురాలిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆటోడ్రైవర్ హత్యచేసిన కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను తప్పులతడకగా రూపొందించడమే కాకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయడంలో నిర్లక్ష్యం చూపడంపై బాధిత కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలోని బెంగళూరు రోడ్డుపై బైఠాయించి వాహనాలను కదలనీయకుండా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రావాలంటూ నినాదాలు చేస్తూ, పోలీసులకు వ్యతిరేకంగా గళమెత్తారు. హత్యకేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హత్యకు గురైన వృద్ధురాలి మనవడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తక్షణమే యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తెలిపిన వివరాలు..శనివారం ఉదయం చంద్రాకాలనీ లక్ష్మీనగర్‌కు చెందిన వృద్ధురాలు గంగులమ్మ(73) వరుసకు కుమారుడైన వెంకటరమణ తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటడంతో, వైద్యచికిత్స నిమిత్తం అవసరమైన రూ.2లక్షలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి మెయిన్‌రోడ్డుకు చేరుకుంది. అదేసమయంలో ఎగువకురవంక భవానీ నగర్‌కు చెందిన విష్ణువర్దన్ ఆటోలో అటువైపుగా రావడంతో గంగులమ్మ ఆటోను ఆపింది. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాలని, తన కొడుకు వైద్యచికిత్సకు డబ్బులు తీసుకెళుతున్నానని, తొందరగా తీసుకెళ్లాల్సిందిగా కోరింది. గంగులమ్మ వద్ద డబ్బులు ఉన్న విషయంతో పాటు ఆమె ఒంటిపై నగలు ఉండటంతో విష్ణువర్దన్ దుర్బుద్ధితో ఆమెను బైపాస్‌మీదుగా నిమ్మనపల్లె సర్కిల్ రామాచార్లపల్లె చెరువు మొరవ సమీపంలోకి తీసుకెళ్లాడు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తుల సహాయంతో పథకం ప్రకారం గంగులమ్మను హత్యచేసి ఆమెవద్ద ఉన్న నగదు, నగలను కాజేసి, వారిద్దరినీ అక్కడి నుంచి పంపేశాడు. గంగులమ్మ ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి పడిపోయి చనిపోయిందంటూ ఆటో డ్రైవర్ విష్ణువర్దన్ కట్టుకథ అల్లాడు. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు డ్రైవర్ విష్ణువర్దన్ ప్రవర్తనపై అనుమానం రావడం, గంగులమ్మ తల, ఒంటిపై తీవ్రగాయాలు, రక్తస్రావం ఉండటంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ విష్ణువర్దన్‌ను పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే కేసు నమోదుకు సంబంధించి పోలీసులు రాత్రి వరకు తర్జనభర్జనలు పడటం, కేసులో ఎక్కడా నగలు, నగదు గురించి ప్రస్తావించకపోవడం, ఆటో డ్రైవర్‌తో ఐదురూపాయల చిల్లర కోసం జరిగిన గొడవలో హత్య జరిగిందని నిర్ధారించారు. ఈలోపు బాధితులు ఎమ్మెల్యే షాజహాన్‌బాషాను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఆయన స్టేషన్‌కు వెళ్లండి. నేను ఫోన్ చేస్తానని చెప్పారు. దీంతో బాఽధితులు స్టేషన్‌కు చేరుకుంటే, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా పరుష పదజాలంతో తిట్టారు. ఎమ్మెల్యేకు చెబితే పనులు చకచకా జరిగిపోతాయా...స్టేషన్ నుంచి బయటకు వెళ్లండంటూ గదమాయించారు. ఉదయం 4 గంటలకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు శవపంచనామా త్వరగా పూర్తిచేసి మృతదేహాన్ని అప్పగించాలని పోలీసులను కోరితే, ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత భోజనం చేసుకుని రండంటూ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసుల తీరును నిరసిస్తూ బెంగళూరు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో రూరల్, టూటౌన్ సీఐలు సత్యనారాయణ, రామచంద్ర, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, గాయత్రిలు అక్కడకు చేరుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారు వినకుండా ఎమ్మెల్యే వచ్చి సమస్యను పరిష్కరించాలని పోలీసులతో గొడవకు దిగారు. ఇంతలో గంగులమ్మ మనుమడు మనోహర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో, పోలీసులు తక్షణమే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చులకనగా మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని, కేసు విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు పోస్టుమార్టం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవడంతో నిరసన విరమించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని గంగులమ్మ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
బాధితుల రాస్తారోకో
ఎఫ్‌ఐఆర్ తప్పులతడకగా ఉందంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
మృతదేహాన్ని అప్పగించలేదని కుటుంబ సభ్యుల నిరసన
ఎట్టకేలకు ఎమ్మెల్యే జోక్యంతో
సద్దుమణిగిన వివాదం

హత్యకేసులో పోలీసుల నిర్లక్ష్యం