
దార్శనికుడు బాబా సాహెబ్ అంబేడ్కర్
రాయచోటి : సమాజంలో అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం డాక్టర్ బాబా సాహెబ్ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడన్నారు. రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని, ఆయనను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విధుల్లో పునరంకితం అవుదామని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంమలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ పి.రాజారమేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌లు వీజే రామకృష్ణ, ఎం.పెద్దయ్య, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు