
టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు..!
కురబలకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. హార్సిలీ హిల్స్‌లో ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ముందే ఈ నెల 13న టీడీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతోపాటు పరస్పరం తన్నుకున్న విషయం తెలిసిందే. అది ఇంకా మరువక మునుపే కురబలకోట మండలంలో అన్నమయ్య జిల్లా టీడీపీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌కు చెందిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ చించివేయడం రోడ్డుపక్కన విసిరివేయడం లాంటివి చేశారు. ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటన పురస్కరించుకుని ఆయనను స్వాగతిస్తూ ఇటీవల హైవే పొడవునా కంటేవారిపల్లె నుంచి చెన్నామర్రి మిట్ట, దొమ్మన్నబావి, విశ్వం కళాశాల సర్కిల్ తదితర ప్రాంతాలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అక్కసుతో వాటిని ఎక్కడికక్కడ చించి వేశారు. ఈ మార్గంలో సీసీ పుటేజీలు పరిశీలించి ఫ్లెక్సీల చించివేత, తొలగింపు కారకులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సురేంద్ర యాదవ్ మంగళవారం ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతను ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకుడితో తీవ్రంగా విభేదిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడలకు పార్టీలో ఓ వర్గం నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది జీర్ణించుకోలేక అతని ప్రమేయంతోనే సురేంద్ర యాదవ్ ఫ్లెక్సీలను చించివేయడం, తొలగించడం లాంటివి చేసి ఉంటారని భావిస్తున్నారు. నియోజక వర్గంలోని టీడీపీ వర్గ పోరు రచ్చకెక్కడంతో అది కాస్తా చర్చనీయాంశంగా మారింది.
రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్
అధ్యక్షుడి ఫ్లెక్సీలు చించివేత
సురేంద్ర యాదవ్ పోలీసులకు ఫిర్యాదు

టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు..!