
ఆధునిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు
రాయచోటి : అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానం ద్వారా కేసుల దర్యాప్తులో వేగం పెంచుకోవాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులన ఆదేశించారు. బుధవారం రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు స్టేషన్‌ల అధికారులతో ఎస్పీ అధ్యక్షతన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ముఖ్య నేర సంఘటనలు, వాటిపై చేపట్టిన విచారణలు, పరిష్కారాల పురోగతి తదితర అంశాలపై సమగ్ర సమీక్ష చేశారు. నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మహిళల భద్రత, మైనర్‌లపై జరుగుతున్న అకృత్యాల నిరోధం, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వ్యాప్తి అడ్డుకోవడం, మైనర్లు వాహనాలు నడపకుండా కఠిన చర్యలు, రౌడీషీటర్లపై నిఘా పెంచి కార్యకలాపాలను అణచివేయాలన్నారు. కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేసే వారిని అరికట్టడం, సైబర్ నేరాలు తగ్గించడం వంటి పలు అంశాలపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ల పనితీరుపై పరిశీలన చేపట్టి ప్రజలతో మరింత సన్నిహితంగా ఉండే విధంగా ప్రజాసేవ దృక్పథంతో పనిచేయాలని సూచించారు. సమిష్టి కృషి, సమన్వయంతో పనిచేసి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రాయచోటి అర్బన్, రూరల్ సీఐలు బీవీ చలపతి, ఎన్.వరప్రసాద్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మర్రి తులసీరామ్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నేర సమీక్షా సమావేశంలో
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు