
ముగ్గురు అంతర్ జిల్లా బైక్ దొంగలు అరెస్టు
మైదుకూరు : వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో బైకులను దొంగతనం చేస్తున్న ముగ్గురు అంతర్ జిల్లా బైక్ దొంగలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 27 బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద గత నెల 21న ఓ విద్యార్థికి చెందిన స్కూటీ చోరీకి గురైంది. ఆ మేరకు చాపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీనిపై ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశంతో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక బృందాన్ని నియమించారు. ప్రొబేషన్ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ జె.శివశంకర్, చాపాడు ఎస్‌ఐ కె.చిన్న పెద్దయ్యలకు అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం చాపాడు మండలం అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు, మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీని చేపట్టారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు మోటారు బైక్‌లపై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. విచారణలో పట్టుబడిన వారు జిల్లాలోని లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన కర్ణ పవన్ కుమార్ రెడ్డి, కర్ణ లోకనాథ్‌రెడ్డి, పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన గంగిరెడ్డి అశోక్‌రెడ్డిగా తేలారు. వీరు బైక్‌లను దొంగిలింస్తుంటారని తెలిసింది. మార్చి 21వ తేదీన సీబీఐటీ కాలేజీ వద్ద స్కూటీని తామే చోరీ చేసినట్లు వారు అంగీకరించారు. మరింత లోతుగా విచారించడంతో సత్యసాయి జిల్లా కదిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి, వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, తొండూరు, పులివెందుల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 27 బైక్‌లను చోరీ చేసినట్లు వెల్లడించారు. చోరీ చేసిన బైకులను విక్రయించేందుకు వెలిగండ్ల గ్రామంలో దాచి ఉంచినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రొబేషన డీఎస్పీ టి.భవాని నిందితులను, బైకులను చూపించారు. మరో రెండు బైకులను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎస్సీ ఆదేశాల మేరకు బైక్ దొంగడలను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన చాపాడు పోలీసులు వి.బ్రహ్మేంద్ర, మధుసూదన్‌రెడ్డి, సబ్ డివిజన్ క్రైం పార్టీకి చెందిన పోలీసులు తిరుమలయ్య, నవీన్, గణేష్, ప్రసాద్, రాఘవరెడ్డిలను అభినందించి వారికి రివార్డులను అందజేశారు. సమావేశంలో రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య పాల్గొన్నారు.
27 ౖబైకులు స్వాధీనం
వివరాలను వెల్లడించిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్