
వ్యక్తి అదృశ్యం
ఓబులవారిపల్లె : గాదెల వెంకటాపురం గ్రామానికి చెందిన టి.శంకరయ్య 15 రోజులుగా కనిపించడం లేదని, గురువారం కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. ఎవరికై నా ఆచూకీ తెలిసినట్లయితే 9121100580 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
విద్యుత్ స్తంభం విరిగిపడి పాడి ఆవు మృతి
రామసముద్రం : జోరుగా వీచిన ఈదురు గాలులకు చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ లైన్‌పై పడటంతో ఆ దెబ్బకు విద్యుత్ స్తంభం విరిగి పాడి ఆవుపై పడింది. ఈ ప్రమాదంలో పాడి ఆవు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి అరికెల పంచాయతీ దాసిరెడ్డిపల్లిలో జరిగింది. ఆవు యజమాని దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నిలుపుదల కోసం విద్యుత్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడి ఆవు విలువ సుమారు. రూ.70వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
వరకట్న వేధింపులపై
కేసు నమోదు
రామసముద్రం : వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాలేనత్తం పంచాయతీ ఎరపశెట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమార్తె లావణ్య (23) ను పెద్దపంజాణికి చెందిన సునీల్ ప్రతాప్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే భర్త సునీల్ ప్రతాప్, అత్త గంగులమ్మలు వరకట్నం తెమ్మని వేధిస్తున్నారని లావణ్య ఫిర్యాదు చేసిందన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వ్యక్తిపై దాడి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని మల్లెల గ్రామ మసీదులో మౌజన్‌గా పని చేస్తున్న అజ్మత్‌పై అదే గ్రామానికి చెందిన వల్లీసాబ్ అనే వ్యక్తి దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామంలో ఉన్న ఓ చింత చెట్టు ఫలసాయాన్ని మసీదు అవసరాలకు వినియోగించాలనేది మత పెద్దల నిర్ణయం. ఈ నేపథ్యంలో మౌజన్ చింత కాయలను కోస్తుండగా ఇదే గ్రామానికి చెందిన వల్లీసాబ్ అనే వ్యక్తి ఈ చింత చెట్టు తమ పూర్వీకులదని, ఇందులో తమకూ హక్కు ఉందని, కాయలు కోయడానికి నువ్వెవరు అని దూషిస్తూ అజ్మత్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.