
ధర లేక.. దిక్కుతోచక!
● పంట విక్రయించేందుకు అన్నదాత అగచాట్లు
● తగ్గుతున్న ధాన్యం ధరలు
● ఆందోళనలో రైతులు
సుండుపల్లె: రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు మాత్రం లేవు. ఎకరం వరి పంట సాగు చేయాలంటే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడ పీడలను నివారిస్తూ తీరా పంట చేతికి వచ్చాక మార్కెట్లో ధర ఉండటం లేదని.తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు.
● జిల్లాలో 6,885 హెక్టార్లకు 2024–25 సంవత్సరం రబీ సీజన్లో 2,735 హెక్టార్లలో మాత్రమే రైతులు వరి పంటను సాగు చేశారు. సిద్దవటం మండలంలో 621 హెక్టార్లు, నందలూరు మండలంలో 300, రాజంపేట మండలంలో 260, కలికిరి మండలంలో 231, వాయల్పాడు మండలంలో 203, పీలేరు మండలంలో 147, సుండుపల్లె మండలంలో 133 హెక్టార్లలో వరి పంటను సాగు చేయగా మిగతా మండలాల్లో వరి సాగు తగ్గింది. వ్యవసాయ కూలీలు, రసాయనిక ఎరువులు, తెగుళ్లకు మందులు, సేద్యపు ఖర్చులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కౌలు రైతులకు అదనంగా ఖర్చు వస్తుంది. కూలీలు సమయానికి దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు పంట పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చి విక్రయించే వరకు భయం భయంగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
గత ప్రభుత్వంలో 77 కేజీల
వరి ధాన్యం బస్తా రూ.2 వేలు
గత ప్రభుత్వంలో జిల్లాలో 77 కేజీల వరి ధాన్యం బస్తా రూ.2 వేల నుంచి గరిష్టంగా రూ.2,200 వరకు అమ్మినట్లు రైతులు తెలిపారు. కానీ ఈసారి రబీ సీజన్లో వరి ధాన్యం బస్తా రూ.1,400 రేటు పలికింది. దీంతో ఒక్కో బస్తాపై దాదాపు రూ.600 నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు దుక్కులు దున్నేందుకు ఎరువులు, వరి నాటు, కలుపు కూలీలు, వరికోత ఖర్చులు కలిపి దాదాపు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఒక ఎకరాకు పంట బాగా పండితే 38 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు.
వరి రైతుకు రూ.15.58 కోట్ల నష్టం
జిల్లాలో ఎకరాకు 38 బస్తాలు దిగుబడి వస్తుంది. కానీ ఒక బస్తాకు రూ.600 రేటు తగ్గింది. జిల్లాలో 6,837 ఎకరాల్లో వరి సాగు చేయగా ఒక ఎకరాకు 38 బస్తాల సగటున 2,59,806 బస్తాల దిగుబడి అంచనా. ఒక బస్తాకు రూ.600 చొప్పున రూ.2,59,806 బస్తాలకు నష్టం రూ.15,58,83,600 ఈసారి రబీ రైతులు వరి ధాన్యంపై నష్టపోయారు.
నియోజకవర్గాల వారీగా వరిసాగు హెక్టార్లలో..
గిట్టుబాటు ధర కల్పించాలి
రెండు ఎకరాలలో వరి పంటను సాగు చేశాను. సాగు ఖర్చులు పెరగడంతో అప్పు చేసి పెట్టుబడి పెట్టినా పంట చేతికందే సమయంలో ధరలు ఉండటం లేదు. దీంతో తమ కష్టానికి ఫలితం దక్కడం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. – పోకల సిద్దయ్య, రైతు, సుండుపల్లె మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
రబీ సీజన్లో రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశా. ఎకరా పంట సాగుకు రూ.40 ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు ఐదున్నర పుట్టి వచ్చింది. అయితే పుట్టి వడ్లు రూ.11 వేలకు అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో పుట్టి వడ్లు రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – నాగమునిరెడ్డి, రైతు, వంతాటిపల్లి, సిద్దవటం మండలం

ధర లేక.. దిక్కుతోచక!

ధర లేక.. దిక్కుతోచక!

ధర లేక.. దిక్కుతోచక!

ధర లేక.. దిక్కుతోచక!

ధర లేక.. దిక్కుతోచక!