‘పట్టపు’ భాష మాది! | - | Sakshi
Sakshi News home page

‘పట్టపు’ భాష మాది!

Published Fri, Apr 28 2023 1:56 AM | Last Updated on Fri, Apr 28 2023 1:56 AM

వేటకు వెళ్లి చేపలు తెస్తున్న పట్టపు మత్స్యకారులు - Sakshi

వేటకు వెళ్లి చేపలు తెస్తున్న పట్టపు మత్స్యకారులు

వేటపాలెం: భాష్యతే ఇతి భాషః అంటే భాషించబడేది భాష. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే సంభాషణే భాష. ఒకరి అభిప్రాయాలు మరొరకు పంచుకోవడానికి భాష అవసరం. మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి. అందులో కొన్నింటికి లిపి ఉండదు. కాని ఆ భాషలు నేటికీ సజీవంగా ఉన్నాయి. అంతటి గొప్పది భాష. లిపి లేకపోయినా ప్రధానంగా లిపి ఉండి మాట్లాడుతున్న భాషలో ఉన్న పదాలతో మిళితమై మనుగడ సాధిస్తుంటాయి. తమిళనాడులో తెలుగువాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. వందల ఏళ్ల కిందటే వాళ్లు అక్కడ స్థిరపడిపోయారు. మరి తమిళనాడు నుంచి దాదాపు వందల ఏళ్ల కిందట మన ప్రాంతాలకు వలస వచ్చారు. వారి వారసులిప్పుడు ఇక్కడ ప్రస్తుతం 3 లక్షల పైచిలుకు జనాభా ఉన్నారు. ఆలా వలస వచ్చిన వారి మాతృభాష తమిళం కాదు. తనదైన సొంత పదజాలం ఉన్న ప్రత్యేక మైన భాష వారిది. వాళ్ల ఆచార వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వీరు చైన్నె పట్టణం నుంచి వలస వచ్చినందున వల్ల పూర్వీకులు వీరిని పట్టపు అని పిలుచుకొనే వారు. బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని బంగాళాఖాత తీరంలో పట్టపు అనే చేపలు పట్టి జీవనం సాగించేవారు. సామాజికవర్గానికి చెందిన 146 గ్రామాల్లో ప్రజలు నివాసం ఉంటుంటారు. ఈ ప్రజలు తెలుగు సంస్కృతికి ఆచార వ్యవహారాలకు అన్ని దగ్గరగానే ఉంటుంటారు. అటు తమిళం ఇటు తెలుగుకు ఏ మాత్రం సంబంధం లేనిదిలా ఉండే పట్టపు భాష వారి అమ్మభాషగా పిలుచుకుంటారు. ఈ భాషకు ఏటువంటి గుర్తింపు లేదు. అసలు లిపి లేదు. ఈ భాష తమిళంతో సారూప్యత కనిపిస్తున్నప్పటికీ అక్కడక్కడ తెలుగు పదాలు వినిపిస్తాయి. సముద్రంలో చేపల వేటే వారికి జీవనాధారం. అయితే ఈ భాషకు లిపి లేకపోవడం వారికి పెద్ద లోటు. అయితే వారి పిల్లలు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులోనే చదువుకుంటున్నారు. వారికి బయటి వ్యవహారానికి తెలుగే ఆధారం, అయినప్పటికీ వారు వారి మాతృభాషను మర్చి పోలేదు. వారిలో వారు కుటుంబంలో పట్టపు భాషనే మాట్లాడుకుంటారు.

ఆచారాలు ప్రత్యేకం..

గ్రామంలో వారందరిదీ ఒక్కటే మాట. వారి గ్రామాల్లో కట్టుబాట్లు ప్రధానమైనవి. అయినప్పటికీ తెలుగు ప్రజలతో కలిసిపోయినా ఆచార వ్యవహారాల్లో మాత్రం వారి ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంటారు. మామూలుగా తెలుగువాళ్లు జరుపుకొనే దసరా, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమితో పాటు మరి కొన్ని పండుగలు జరుపుకొంటారు. సాధారణంగా తెలుగువాళ్లు పంచాంగాన్ని అనుసరించి పెళ్లిళ్లు, గృహాప్ర వేశాలు, శంకుస్థాపనలు, పండగలు జరుపుకొంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి జీవన విధానంలోనే మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో పట్టపు మత్స్యకారులు నివాసం సుమారుగా 3 లక్షల మంది జనాభా సముద్ర తీర గ్రామాలు వీరి నివాసం ఈ భాషకు లిపి ఉండదు గ్రామ కట్టుబాట్లు ప్రత్యేకం

పూర్వీకులు చైన్నె నుంచి వలస వచ్చారు..

వందల ఏళ్ల కాలంలో మా పూర్వీకులు ఈ ప్రాంతాలకు చైన్నె నుంచి వలస వచ్చారు. అప్పటి నుంచి సముద్రతీరంలో గ్రామాల్లో నివాసం ఉంటున్నాం. పట్టణం నుంచి వలస వచ్చిన వారం కావడంతో పట్టపు సామాజిక వర్గంగా అప్పట్లో పెద్దలు పిలుస్తుండేవారు. మా భాషకు లిపి ఉండదు.

–కొండూరి అంజయ్య, పొట్టిసుబ్బయ్యపాలెం

గ్రామాల్లో కట్టుబాట్లు

ఉంటాయి..

మా పట్టపు గ్రామాల్లో పూర్వీకుల నుంచి కట్టుబాట్లు ఉంటాయి. గ్రామ ప్రజలు ఎన్నుకున్న పెద కాపులు గ్రామ కట్టబాట్లను నిర్ణయిస్తారు. వీటిని అతిక్రమించిన వారికి తురాయి వేస్తారు. ప్రతి ఒక్కరూ కట్టుబాట్లు పాటించాల్సిందే.

– వాయిల బాబు, కఠారివారిపాలెం

కట్టుబాట్లు కఠినం..

గ్రామాల్లో వారి పూర్వీకుల నుంచి వస్తున్న కట్టుబాట్లు కఠినంగా ఉంటాయి. గ్రామానికి నలుగురు పెద్దలను పెదకాపులుగా ఎన్నుకుంటారు. గ్రామానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పచేస్తే పెదకాపుల గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి తీర్పు చెప్తారు. గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి పెద కాపులు వారికి తీర్పులు ఇస్తారు. తీర్పులకు గ్రామస్తులు కట్టుబడి ఉండాలి. కట్టుబాట్లు ఉల్లంఘించిన వారికి జరిమానాలు (తురాయిలు) విధిస్తుంటారు. ఈ జరిమానాల ద్వారా వచ్చిన నగదును గ్రామాభివృద్ధికి వినియోగిస్తుంటారు. గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కారం కాని సమస్యలను తీర ప్రాంత పట్టపు గ్రామాలకు చెంది పెదకాపులు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కఠారివారిపాలెం పట్టపు గ్రామంలో సమావేశం1
1/3

కఠారివారిపాలెం పట్టపు గ్రామంలో సమావేశం

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement