కొరిశపాడు పనుల్లో వేగం పెంచండి
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
బాపట్ల: కొరిశపాడు రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. ఎర్రం చిన్నపోల్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి శనివారం అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు వంద శాతం పనులు పూర్తి అయినందున 1వ డివిజన్ ప్రధాన కార్యాలయాన్ని ఒంగోలు నుంచి బాపట్లకు తరలించేందుకు ప్రతిపాదన తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి 1.33 టీఎంసీలతో బాపట్లలో 20 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏర్పాటు చేయనున్న కొరిశపాడు రిజర్వాయర్ పనులను మ్యాప్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీహరి వివరించారు. రిజర్వాయర్‌లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ప్రతిపాదన తయారు చేయాలని పేర్కొన్నారు. ఎల్ ఏ స్థాయిలో ఉన్న పనులను అవార్డు స్థాయికి తీసుకురావాలని సూచించారు. పెద్దూరు, తూర్పుపాలెం స్ట్రక్చర్‌కు నిధులకు సంబంధించి ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. రిజర్వాయర్‌కి సంబంధించి సర్వే వివరాలపై ఆరా తీశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అవసరమైన రికార్డుల విషయంలో కొరిశపాడు తహసీల్దార్లు సహకరించాలని ఆయన ఆదేశించారు. రిజర్వాయర్ పూర్తికి ఎల్ ఏ, ఆర్ అండ్ ఆర్, పనులను కావాల్సిన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, చీరాల వాటర్ రీసోర్స్ డిప్యూటీ ఇంజినీర్ సుజాత, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆహ్లాదకర వాతావరణం అందరి బాధ్యత
రేపటి తరాల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ప్రజలకు పిలుపు ఇచ్చారు. శనివారం స్థానిక బాపట్ల పట్టణంలో 32వ వార్డు చంగల్‌రావుతోట తోటలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని, అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు వ్యర్థ పదార్థాలను మూడు రకాల డస్ట్ బిన్లలో వేయాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం మానవజాతి మనుగడకు పెను ప్రమాదకరమని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన సూచించారు. 32వ వార్డు చంగల్‌రాయుడు తోటలో చెత్త నుంచి తయారైన ఎరువుతో పూల మొక్కలు, పండ్ల తోటలను సాగు చేస్తున్న పుష్ప అనే మహిళ గృహాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు.
కుందేరు ఆక్రమణలను నివారించాలి
కుందేరు వాగు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ, డ్రైనేజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాగుకు సంబంధించి సమగ్ర సర్వే రిపోర్ట్ రూపొందించాలని ఆదేశించారు. వాగు విస్తరణ, రెండువైపులా కాలువలు నిర్మించడానికి డీపీఆర్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. బాపట్ల ఆర్‌డీవో గ్లోరియా, చీరాల ఆర్‌డీవో చంద్రశేఖర్ నాయుడు, డ్రైనేజ్ శాఖ ఇంజినీర్ సుబ్బారావు, బాపట్ల తహసీల్దార్ సలీమా, చీరాల తహసీల్దార్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రహదారి భద్రత ఎంతో ముఖ్యం
బాపట్ల: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా రోడ్డు భద్రత నిబంధనలపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అభినందించారు. స్థానిక బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో రవాణా శాఖ నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు ధ్రువీకరణపత్రాలు, మెమెంటోలను శనివారం ఆయన అందజేశారు. జిల్లా రవాణాశాఖాధికారి టి.కె. పరంధామరెడ్డి మాట్లాడుతూ పోటీల్లో పి.శ్రీవల్లి (8వ తరగతి) మొదటి, జె.షణ్ముఖ ప్రియ (9వ తరగతి) రెండో, టి.సన్నిధి (6 వ తరగతి) మూడో, ఎన్. మాధురి (7వ తరగతి), పి.వర్షిక (5వ తరగతి) కన్సోలేషన్ బహుమతులు పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ ఎన్. ప్రసన్న కుమారి, ఏఎంవీఐ పి. అంకమ్మరావు, రోడ్డు సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్, ఉపాధ్యాయురాలు జి.హేమలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment