హనుమత్ వైభవం చాలా గొప్పది
తెనాలి: హనుమత్ వైభవం చాలా గొప్పదని, వాస్తవానికి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయస్వామిగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) అన్నారు. స్థానిక షరాఫ్‌బజారులోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బాలస్వామి సోమవారం దర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తన బాల్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతో అనుబంధాన్ని గుర్తుచేశారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. హనుమంతుడి ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయాలు ఉంటాయని చెప్పారు. హనుమాన్ చాలీసా కూడా జయహనుమతోనే ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. మాఘమాసంతో సహా ఏ మాసంలో ఏరోజు ఏమేం చేయాలో? ధర్మ ఆచరణ విధివిధానాలను పెద్దలు చెప్పారనీ, ప్రజలు శాస్త్రప్రకారం ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ తమ జీవనవిధానాన్ని ఆచరించాలని సూచించారు. బాలస్వామీజీకి ఆలయ ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, ప్రధాన అర్చకుడు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్‌వీ కిరణ్‌కుమార్ స్వాగతం పలికారు. స్వామీజీతో సాలిగ్రామ మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, సభ్యులు రాజేశ్వరరావు, ప్రభరాణి, వరలక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ బృందం తక్కెళ్లపాడు సందర్శన
పెదకాకాని: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సద్వినియోగంపై నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తక్కెళ్లపాడు పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. బృందం సభ్యులు జిష్యుపాల్, స్వప్నలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సడక్ యోజన, పింఛన్ పంపిణీ, డ్వాక్రా యానిమేటర్లతో మాట్లాడారు. డ్వాక్రా స్వయం సహాయ సంఘాలకు మంజూరు చేసిన నిధుల సద్వినియోగంపై డ్వాక్రా సంఘాల మహిళలతో చర్చించారు. ఈ పథకాలను సంబంధించిన పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: పసుపు గరిష్ట ధర రూ.9800 పలికింది. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుకు సోమవారం 320 బస్తాలు రాగా మొత్తం అమ్మకం జరిగినట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. సరకు కనిష్ట ధర రూ.9600, గరిష్ట ధర రూ.9800, మోడల్ ధర రూ.9800, కాయ కనిష్ట ధర రూ.9,551, గరిష్ట ధర రూ.9700, మోడల్ ధర రూ.9700 పలికినట్లు తెలిపారు.
రైలు ఢీకొని గుర్తు
తెలియని వ్యక్తి మృతి
చీరాల రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన సోమవారం చీరాల రైల్వే స్టేషన్ ఫైరాఫీసు గేటు సమీపంలోని వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. ఫైరాఫీసు గేటు సమీపంలో వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో ప్రమాద స్థలాన్ని పరిశీలించగా మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని, మృతదేహంపై బ్లాక్ కలర్ చొక్కా, గళ్ల లుంగీ ఉందని చెప్పారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ ఎస్సై 94406 27646 కు సమాచారం అందించాలన్నారు.
హనుమత్ వైభవం చాలా గొప్పది
Comments
Please login to add a commentAdd a comment